ప్రైవేట్‌ ఫీజుల బడిత పూజ | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఫీజుల బడిత పూజ

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

జూనియర్‌ కళాశాలల్లో అదే తంతు

అదే ఇంటర్మీడియెట్‌కు..

ఇంటర్‌లో చేరే విద్యార్థికి జేఈఈ అడ్వాన్స్‌ వంటి అంశాలతో కార్పొరేట్‌ స్థాయి కళాశాలలో చేర్పిస్తే ఒక్క ఫీజే రూ.1.60 లక్షలుగా ఉంది. మిగిలినవన్ని మామూలే. అంటే సుమారుగా రెండో కుమారుడికి రూ.2.70 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపుగా ఈ ఏడాది కట్టాల్సినవి, ఇతర చిన్నచిన్న ఖర్చులతో సుమారుగా ఐదు లక్షల వరకూ విద్యకోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇది ఒక సాధారణ స్థాయి విద్యాసంస్థకు మాత్రమే. అదే ఇంటర్నేషనల్‌ పేరుతో ఉన్న విద్యాసంస్థకు ఫీజు ఒక్కటే నాలుగు లక్షల వరకూ చెల్లించాల్సి ఉంది. సాధారణ పాఠశాలల్లో సైతం గత ఏడాది కంటే 20 నుంచి 30 శాతం పెంచి వసూలు చేస్తున్నాయి.

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల దెబ్బకు తల్లిదండ్రులు విలవిలలాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు పిల్లల ఉన్న కుటుంబాల్లో చదువు ఖర్చు వారికి తడిసిమోపెడవ్వటంతో దయనీయమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జూన్‌ నెలలో అప్పులపాలవుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో వెయ్యి ప్రైవేట్‌ విద్యాసంస్థలు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారుగా వెయ్యి ప్రైవేట్‌ విద్యాసంస్థలు కొనసాగుతున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అందులో సుమారుగా 3.25 లక్షల వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో సుమారుగా 510 వరకూ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కొనసాగుతుండగా అందులో సుమారుగా 2.30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. కృష్ణా జిల్లాలో సుమారుగా 450 వరకూ ప్రైవేట్‌ విద్యాసంస్థలు ఉండగా అందులో సుమారు లక్షల వరకూ విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల సంఖ్య సైతం మరో లక్షన్నర వరకూ ఉంటుంది.

ప్రభుత్వం అజమాయిషీ ఏదీ

ఫీజుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కూటమి నేతలకు సంబంధించిన విద్యాసంస్థలే రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయని, అవే అత్యఽధికంగా వసూళ్లకు పాల్పడుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. కొన్ని విద్యాసంస్థలు లక్షల్లో ఫీజు వివరాలను బహిరంగంగా వారి వెబ్‌సైట్‌లో పెట్టి మరీ వసూళ్లకు పాల్పడటం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపుతోందని విద్యార్థి సంఘ నేతలు మండి పడుతున్నారు.

స్టేషనరీ వ్యాపారంతో భారీ ఆదాయం

మరోవైపు ప్రైవేట్‌ విద్యాసంస్థలు పుస్తకాలు, ఇతర స్టేషనరీ పేరుతో దందా ప్రారంభించాయి. ఫీజులు ఇతర చెల్లింపులు పక్కన పెడితే పుస్తకాలు, యూనిఫామ్‌, ఇతర స్టేషనరీ అమ్మకాల వ్యాపారం ఆయా విద్యాసంస్థలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. ప్రతి విద్యార్థి అదే విద్యాసంస్థలో పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే. లేదంటే యజమాన్యాలు పాఠశాలలోకి అనుమతించని పరిస్థితులున్నాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి నోటు పుస్తకాలు, టెక్ట్స్‌ బుక్స్‌, వర్క్‌ బుక్స్‌, ఇతర స్టేషనరీ పేర్లతో ఆయా యాజమాన్యాలు ఐదు వేల నుంచి రూ.25 వేల వరకూ వసూలుకు పాల్పడుతున్నాయి. స్కూల్‌ యూనిఫామ్‌, బూట్లు ఇతర వస్తువులతో కలిపి రూ.30 వేల వరకూ కొన్ని విద్యాసంస్థలు విక్రయిస్తుండగా ఈ పుస్తకాలపై సుమారుగా 30 నుంచి 50 శాతం లాభం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

నగరంలో కొత్తపేటకు చెందిన చిరుద్యోగి రామారావుకు ఇద్దరు పిల్లలు. ఈ విద్యాసంవత్సరంలో ఒక పిల్లవాడు పదో తరగతికి రాగా మరో కుమారుడు ఇంటర్మీడియెట్‌కు వచ్చాడు. పదో తరగతి మంచి పాఠశాలలో చేర్పించాలని చూస్తే నగరంలో సాధారణ స్థాయిలో ఉన్న ఒక కార్పొరేట్‌ పాఠశాలకు రూ.85 వేలు ఫీజు చెప్పారు. దానికి తోడు యూనిఫాం, పుస్తకాలు మరో రూ.25 వేలు, బస్సుకు ఏడాదికి రూ.25 వేలు చెల్లించాలి. హాస్టల్‌ అయితే సుమారుగా మరో 60 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తుంది. సుమారుగా రెండు లక్షలు చెల్లించాల్సి వస్తోంది.

జూనియర్‌ కళాశాలల్లోనూ అదే తంతు కొనసాగు తోంది. ఉమ్మడి కృష్ణాజిల్లాలో 250 జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఆయా విద్యాసంస్థల్లో మొదటి ఏడాది చేరే విద్యార్థులకు ప్రారంభంలోనే రూ.20 వేలు నుంచి రూ.30 వేలు విలువైన పుస్తకాలు, యూనిఫామ్‌, ఇతర స్టేషనరీకి అవసరం. ఆ మేరకు రెండుమూడు దఫాలుగా వాటిని వసూలు చేస్తున్నారు. వీటిపై ప్రశ్నిస్తే మీకు అడ్మిషన్‌ లేదు వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. పిల్లలు చదవాలంటే చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తల్లిదండ్రుల కన్నీళ్లపై విద్యావ్యాపారం

భారీగా పెరిగిన ప్రైవేట్‌ విద్యాసంస్థల ఫీజులు

పుస్తకాలు, స్టేషనరీ పేరుతో వ్యాపారం

విలవిలలాడుతున్న తల్లిదండ్రులు

పట్టించుకోని పాలకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement