సాగుకు ఇబ్బందులే | - | Sakshi
Sakshi News home page

సాగుకు ఇబ్బందులే

Jun 15 2026 7:28 AM | Updated on Jun 15 2026 7:28 AM

సాగుకు ఇబ్బందులే ఖరీఫ్‌కు సిద్ధం

ఎన్టీఆర్‌ జిల్లాలో..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం పెరుగుతోంది, ఖరీఫ్‌ సీజన్‌పై ఆశలు పెట్టుకున్న రైతుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పొలాలు దున్నడం.. నారుమడి ఏర్పాట్లు.. విత్తనాల సేకరణ వంటి పనుల్లో రైతులు నిమగ్నమవుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ బాగా సాగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు నీటి విడుదల జాప్యమవుతోంది.

సాక్షి ప్రతినిధి,విజయవాడ: తొలకరి పులకింతతో వ్యవసాయ సందడి మొదలైంది. రెండు రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలు రైతన్న మోములో కొత్త ఆశలను చిగురింప జేస్తున్నాయి. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో జిల్లాలో ఖరీఫ్‌ సాగు పనులు ఊపందుకొంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలతో మునేరుతోపాటు, వాగుల నుంచి నీరు ప్రకాశం బ్యారేజికి చేరుతోంది. అక్కడ 12 అడుగులకు పైగా నీరు చేరుకుంది. దీంతో బ్యారేజి నాలుగు గేట్లు, ఒక అడుగు మేర ఎత్తి 2,900 క్యూస్కెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. తాగునీటి కోసం బందరుకాలువకు 300 క్యూసెక్కులు, రైవస్‌ కాలువకు 1500, కేఈబీ కాలువకు 303 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజికి వరద నీరు వచ్చి చేరడంతోపాటు, పులిచింతల ప్రాజెక్టులో సైతం 32 టీఎంసీల నీరు ఉంది. ఎలినినో ప్రభావం ఉందని ఆందోళన చెందుతున్న రైతులకు ఊరట నిస్తోంది.

ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పొలాల్లో దుక్కులు దున్ని విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 2.65 లక్షల ఎకరాలు. ఇందులో ప్రధానంగా వరి పంట 1.22 లక్షల ఎకరాలు, ప్రత్తి 85,142 ఎకరాలు, మొక్క జొన్న 9,312 ఎకరాలు, కంది,పెసర, మినుము పంటలు 17 717.5 ఎకరాలు, మిరప పంట 29, 157.5 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. నందిగామ, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం ప్రత్తి పంట సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. మొక్క జొన్న కంది, మినుము, పెసర పంటలను ప్రస్తుతం రైతులు సాగు చేయనున్నారు. రైతులకు అవసరమైన పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, రైతులకు అవసరమైన స్థాయిలో వ్యవసాయ శాఖ అందుబాటులో ఉంచలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల కురుస్తున్న వర్షాలతో

ఖరీఫ్‌ సాగుకు రైతుల సన్నాహాలు

ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ..

ప్రకాశం బ్యారేజికి చేరుతున్న నీరు

ఇప్పటికే తాగునీటిని విడుదల

చేసిన అధికారులు

సాగునీటి విడుదలలో జాప్యం

సాగుకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. జూన్‌ నెల వచ్చినా ఇంకా కాలువలకు నీళ్లు వదల్లేదు. బోర్లు కింద నారుమడులు పోసుకుంటున్నాం. వరి నాట్లు వేసుకోవాలంటే కాలువ నీరు కూడా అవసరం. గత వైఎస్సార్‌ సీపీ హయాంలో సీజన్‌ ప్రారంభానికి ముందే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకున్నారు. ఈ సారేమో ఎప్పుడు ఇస్తారో అర్థం కావడం లేదు.

–కొండవీటి వెంకట సుబ్బారావు,

రైతు, మంతెన, కంకిపాడు మండలం

కృష్ణా జిల్లాలో తొలకరి చినుకులు, ప్రకాశం బ్యారేజికి నీరు చేరుతుండటంతో రైతులు బోర్ల కింద నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. కొంత మంది రైతులు వెద పద్ధతిలో సాగుకు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీరణం 4,15,185 ఎకరాలు. ఇందులో ప్రధానంగా వరి పంట సాగు విస్తీర్ణం 4,05, 307.5 ఎకరాలు. మినుము 3,350 ఎకరాలు, చెరుకు 2907.5 ఎకరాలు, వేరుశెనగ 1,625 ఎకరాలు, ప్రత్తి పంట 1,142.5 ఎకరాలు, ఇతర పంటల 837.5 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా సాగునీరు విడుదల చేయగానే పెనమలూరు, గుడివాడ, పామర్రు, గన్నవరం ప్రాంతాల్లో వరిసాగు చేస్తారు. చివరి ఆయకట్టు ప్రాంతాలైన అవనిగడ్డ, పెడన , మచిలీపట్నంలో కొంత ఆలస్యంగా వరి పంటను సాగు చేయనున్నారు. ముందుగా పంట సాగు చేస్తే డిసెంబరులో వచ్చే తుఫానుల బారి నుంచి పంట కాపాడుకోవచ్చని రైతుల భావన.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement