పామర్రు: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డాక్టర్ నరేష్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూఎన్‌వో మిండా లిమిటెడ్, జోయాలూక్కాస్, కురాకు ఫైనాన్షియల్ సర్వీసెస్, ముత్తూట్ ఫైనాన్స్, అడెక్కో ఇండియా లిమిటెడ్, వరుణ్ మోటార్స్, అపోలో ఫార్మసీ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్, మోహన్ స్పింటెక్స్, పేటీఎం సర్వీసెస్ వంటి 10కి పైగా ప్రముఖ కంపెనీల పాల్గొంటాయని వివరించారు. టెన్త్, ఇంటర్మీడియెట్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, బీ ఫార్మసీ, పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని పేర్కొన్నారు. అర్హులు ముందుగా హెచ్‌టీటీపీఎస్://ఎన్‌ఏఐపీయుఎన్‌వైఏఎం.ఏపీ.జీవోవీ.ఐఎన్ వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు.
లబ్బీపేట(విజయవాడ తూర్పు): యూరో– ఆంకాలజీ రంగంలో వేగంగా చోటు చేసుకుంటున్న విప్లవాత్మక వైద్య, సాంకేతిక పరిణామాలు క్యాన్సర్ చికిత్సల్లో నూతన మార్పులకు దారి తీస్తున్నాయని పలువురు వైద్య నిపుణులు పేర్కొన్నారు. మూత్రపిండాలు, ప్రొస్టేట్, మూత్రాశయ క్యాన్సర్ల చికిత్సలో అత్యాధునిక వైద్య విధానాలు, రోబోటిక్ శస్త్రచికిత్సలు, ఆధారబద్ధమైన వైద్య నిర్ణయాలు, క్లిష్ట శస్త్రచికిత్స నైపుణ్యాలపై వైద్యులకు సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో ‘యూరో–ఆంకాలజీ సింప్లిఫైడ్ – 2026’ పేరుతో రాష్ట్రస్థాయి శాసీ్త్రయ సదస్సు విజయవాడలో ఆదివారం జరిగింది. సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (సోగస్–ఏపీ) ఆధ్వర్యంలో, విజయవాడ అసోసియేషన్ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ (వేగస్) సహకారంతో జరిగిన ఈ సదస్సుకు 200 మందికి పైగా యూరాలజిస్టులు, శస్త్రచికిత్స నిపుణులు, యువ వైద్యులు, పీజీ విద్యార్థులు హాజరై యూరో–ఆంకాలజీ రంగంలో తాజా వైద్య విధానాలపై విస్తృతంగా చర్చించారు. సదస్సులో ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎం.వి.కృష్ణకిషోర్, వేగస్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ పి.శ్రీమన్నారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కె.ప్రియతమ్, డాక్టర్ ధీరజ్, పేట్రాన్ డాక్టర్ కె.ప్రశాంత్‌కుమార్ విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు.


