ఓ వైద్యుడి విషయంలో..
● విజయవాడలో 35 మంది
ఏఎన్‌ఎంలకు మెమోలు
● వైద్యాధికారి తీరుపై
మండిపడుతున్న వైద్య ఉద్యోగులు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లా మలేరియా అధికారి ఇప్పుడు వైద్యశాఖలో వివాదస్పదంగా మారారు. ఆయనకు సంబంధం లేని ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడం సమస్యగా మారింది. సాంకేతిక కారణంతో ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్ కావడం లేదని చెప్పినా ఏకంగా నగరంలోని 35 మంది ఏఎన్‌ఎంలకు మెమోలు జారీ చేశారు. దీనిపై ఏఎన్‌ఎంలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
వైద్యశాఖ ఉద్యోగులు ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటిస్తుంటారు. అందులో భాగంగా క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటింటి సర్వే చేసి, అక్కడ ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేస్తుంటారు. అయితే ఇటీవల డ్రైడే ఫ్రైడే రోజు యాప్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఆ ఫొటోలు కొన్ని.. ఉన్నతాధికారులకు కనిపించలేదు. దీంతో ఫ్రైడే డ్రైడే సక్రమంగా నిర్వహించలేదంటూ నోడల్ పర్సన్స్, సీహెచ్‌ఓలు, ఎంపీహెచ్‌ఓలు, పీహె చ్‌ఎన్, ఎంపీహెచ్‌ఎస్, ఎంపీహెచ్‌ఏ, ఆరోగ్య కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలని డీఎంఓ రాజు నాయక్ డీఎంహెచ్‌ఓకు లేఖ పెట్టారు.
ఏకంగా 35 మందికి మెమోలు
జిల్లా మలేరియా అధికారి సూచన మేరకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ ఇందుమతీదేవి ఏకంగా 35 మందికి మెమోలు ఇచ్చారు. రెండు రోజుల్లో డీఎంఓ కార్యాలయంలో వివరణ ఇవ్వాలంటూ పేర్కొనడంతో ఏఎన్‌ఎంలు మండిపడుతున్నారు. అలాగే ఫీల్డ్ విజిట్ సమయంలో డీఎంఓ తీరును ఏఎన్‌ఎంలు ఖండిస్తున్నారు. ఆయన వేధింపులకు ‘సెంట్రల్’లోని ఓ ఏఎన్‌ఎం కన్నీరు పెట్టుకున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు.
జిల్లాలోని ఓ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీకి వెళ్లిన సమయంలో అక్కడ వైద్యుడు లేక పోవడంతో అతడిని డీఎంఓ కామెంట్ చేసినట్లు తెలిసింది. ఆ పీహెచ్‌సీ వైద్యుడు జిల్లాలో కీలకమైన ప్రోగ్రామ్ అధికారిగా పని చేస్తున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆ విషయం తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటంతో ఆ తర్వాత ఉన్నతాధికారులు క్లాస్ తీసుకున్నట్లు తెలిసింది. ఇలా అనవసరమైన విషయాల్లో డీఎంఓ జోక్యం పెరగడంతో వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీజనల్ వ్యాధుల కాలం వస్తోందని, దోమల నివారణపై వారి సిబ్బందితో పనిచేయించాలేగానీ, సంబంధం లేని వారిపై పెత్తనం అంటే ఎలాగని వారు ప్రశ్నిస్తున్నారు.


