● క్యాన్సర్ బారిన పడిన భార్య ● ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనోవేదన ● భార్యాభర్తల ఆత్మహత్య
నందిగామ రూరల్: క్యాన్సర్ వ్యాధి ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. క్యాన్సర్ బారిన పడిన భార్యకు వైద్యం చేయించిన ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మనస్తాపంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని మాగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. సేకరించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన గుర్రం శ్రీనివాసరావు (52) వ్యవసాయంతో పాటు గ్రామంలోనే ఎరువులు, పురుగు మందుల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య శైలజ (48) గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమెను పలు హాస్పిటల్స్‌లో వైద్యం చేయించినా ఆరోగ్యం కుదుట పడలేదు. ఏకై క కుమారుడు వినోద్‌ను ఉన్నత చదువుల నిమిత్తం ఈ ఏడాది ఏప్రిల్‌లో యూకే వెళ్లాడు. శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో దంపతుల మాటల మధ్యన మెరుగైన వైద్యం చేయించాలని భార్య కోరింది. ఆమె ఆరోగ్య పరిస్థితి తెలిసిన శ్రీనివాసరావు మనస్తాపం చెంది గడ్డి మందు తాగడంతో గమనించిన భార్య భార్య శైలజ సైతం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. దంపతుల పరిస్థితిని గమనించిన చుట్టుపక్కల వారు బంధువులకు సమాచారం అందించగా హుటాహుటినా వారిని విజయవాడ తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శ్రీనివాసరావు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందగా శైలజ శనివారం మృతి చెందారు. ఎంతో కలివిడిగా ఉండే భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పి.శ్రీను తెలిపారు.
జి.కొండూరు: విద్యుత్ స్తంభంపై సర్వీస్ వైర్ సరి చేస్తుండగా వ్యక్తి మృతి చెందిన ఘటన జి.కొండూరు మండల పరిధి గంగినేని గ్రామంలో శనివారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. దుగ్గిరాలపాడు గ్రామానికి చెందిన తాటిమట్ల వెంకటకృష్ణారావు(49) కేబుల్ ఆపరేటర్ వద్ద టెక్నీషియన్‌గా పని చేస్తూ విద్యుత్ పరికరాలు సైతం రిపేర్లు చేస్తుంటాడు. ఈ క్రమంలో గంగినేని సహకార సొసైటీకి విద్యుత్ సరఫరాలో సమస్య తలెత్తడంతో సొసైటీకి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై సర్వీసు వైర్‌ను సరి చేసేందుకు శనివారం మధ్యాహ్న సమయంలో స్తంభం పైకి ఎక్కాడు. విద్యుత్ సరఫరాను నిలిపివేయకుండా స్తంభం ఎక్కడంతో స్తంభం పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. వెంకటకృష్ణారావు విద్యుత్ స్తంభం పైకి ఎక్కే సమయంలో సొసైటీ సంఘం పెద్దలు అక్కడే ఉన్నారని, విద్యుత్ షాక్ తగిలి మృతి చెందగానే అక్కడి నుంచి వెళ్లి పోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు సహకార సొసైటీ పెద్దలను నిలదీయగా తమకేమీ సంబంధం లేదని, వారు బుకాయించినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీ పెద్దలు తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు మృతదేహాన్ని కదిలించేదిలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ నాయకులు సైతం ఘటనా స్థలానికి చేరుకొని మద్దతుగా నిలిచారు. ఎట్టకేలకు సొసైటీ సభ్యుల హామీతో వారు ఆందోళనను విరమించారు.
శ్రీనివాసరావు (ఫైల్)
శైలజ (ఫైల్)


