ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ | - | Sakshi
Sakshi News home page

ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’

Jun 14 2026 11:43 AM | Updated on Jun 14 2026 11:43 AM

భవానీపురం(విజయవాడపశ్చిమ): ప్రజలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌, నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో శనివారం భవానీపురంలోని బెరంపార్క్‌, పున్నమి హోటల్‌ వద్ద ‘ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌’ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా కలెక్టర్‌ లక్ష్మీశ, ఆయుష్‌ డైరెక్టర్‌ గోపాలకృష్ణ రోణంకి, జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఒక వైపు యోగాంధ్రతో శరీరాన్ని.. మనసును ఆరోగ్యంగా ఉంచుకుంటూ మరో వైపు ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌తో నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుదామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకమైన పాత్ర పోషించే పారిశుద్ధ్య కార్మికులు కేవలం పనివారు కాదని, దైవసమానులని కొనియాడారు. ఎండైనా.. వర్షమైనా లెక్క చేయకుండా అనుకూల, ప్రతికూల వాతావరణంలో నగరాన్ని శుభ్రపరుస్తూ ప్రజలను ఆరోగ్యవంతులుగా ఉంచడంలో వారు నిర్వహిస్తున్న విధులు అనిర్వచనీయమని పేర్కొన్నారు.

నాలుగు వారాలుగా వేర్వేరు అంశాలతో..

నగరపాలక సంస్థ కమిషనర్‌ ధ్యానచంద్ర మాట్లాడుతూ.. గత నాలుగు వారాలుగా ఒక్కో వారం ఒక్కో అంశంతో ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మొదటి వారం రెడ్‌ స్పాట్‌, ఎల్లో స్పాట్‌ విజిబుల్‌తో, రెండో వారం స్ట్రాం వాటర్‌ డ్రెయిన్స్‌ కాలువల డీసిల్టింగ్‌, మూడో వారం బల్క్‌ వేస్ట్‌ జనరేటర్లకు ఒక ప్రత్యేకమైన వ్యర్ధాల నిర్వహణపై అవగాహన కల్పించడమే కాకుండా నాలుగు రంగుల చెత్త బుట్టల వినియోగంపై వివిధ ఎన్జీవోలు, స్వచ్చంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో అవగాహన కల్పించామని చెప్పారు. ఈ వారం అంశంగా గార్బేజ్‌, పబ్లిక్‌ టాయిలెట్స్‌ను తీసుకుని నగరంలోని మరుగుదొడ్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వాటిని పరిశుభ్రంగా నిర్వహించుకోవడమే కాకుండా ప్రజలుకూడా తమ ఇళ్లల్లోని మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించామని చెప్పారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడమే కాకుండా అక్కడున్న వ్యర్థాలను తీసివేసి శుభ్రం చేశారు. కార్యక్రమంలో వీఎంసీ అదనపు కమిషనర్లు డాక్టర్‌ డి.చంద్రశేఖర్‌, శకుంతల, జోనల్‌ కమిషనర్‌ కె.షమ్మి, చీఫ్‌ మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కె.అర్జునరావు, పర్యవేక్షణ ఇంజినీర్‌ చంద్రశేఖర్‌, ఈఈ జె.శ్రీనివాస్‌, ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ అన్నపూర్ణ, బీఏఎస్‌ డాక్టర్‌ హరీష్‌ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్‌, వీఎంసీ స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ లక్ష్మీశ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement