వైఎస్సార్ సీపీ నేత పోతిన మహేష్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): హిందూత్వంపై, హిందూ దేవుళ్లపై నమ్మకం లేని ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్‌ను తక్షణం తొలగించాలని వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఆయన బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ సుమారు ఐదు వేల ఎకరాల హిందూ ఆలయ భూములకు ఎన్‌వోసీలు జారీ చేసి నాలుగు వేల కోట్ల తక్కువ ధరకు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు.
ఆ దర్యాప్తు ఏమైంది?
టీడీపీ ప్రభుత్వం 2024 నవంబర్‌లో రామచంద్రమోహన్‌పై త్రీమెన్ కమిటీ విచారణకు వేసిందని, నాటి నుంచి నేటి వరకు ఈ త్రీమెన్ కమిటీ ఎందుకు దర్యాప్తు కొనసాగించడం లేదో తెలియటం లేదని పోతిన మహేష్ అన్నారు. ప్రభుత్వం భర్తీ చేయాల్సిన ఆరు పోస్టులలో రెండు పోస్టులను ఏ అధికారం లేకపోయినా అడ్డదారిలో నియామకం చేశారన్నారు. జీవో–888కు ఇష్టానుసారం మార్పులు చేర్పులు చేస్తూ, హైకోర్టులో కంటెంట్ నడుస్తున్నా లెక్కచేయకుండా ఫస్ట్ గ్రేడ్ ఆఫీసర్లు 26 మందిని, సెకండ్ గ్రేడ్ ఆఫీసర్లు 20 మందిని మొత్తం 46 మందికి అక్రమంగా ప్రమోషన్లు కల్పించారన్నారు. దాని ద్వారా సుమారు రూ.15 కోట్లు కమిషనర్, మంత్రి ఆనం పంచుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయన్నారు.
ఇదేం న్యాయం..
అవినీతి ఆరోపణలున్న తిమ్మానాయుడు, సురేష్‌బాబు విశ్వనాథరాజు, చక్రధరరావు వీరందరూ ఓసీ వర్గానికి చెందిన వారని, అందుకే వీరిని సస్పెండ్ చేయకుండా ప్రమోషన్లు కల్పిస్తూ కొనసాగిస్తున్నారని.. కానీ బీసీ సామాజిక వర్గాని కి చెందిన హేమలత, నాగరాజు, సీతారామయ్యలను మాత్రం సస్పెండ్ చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు ప్రధాన దేవాలయాల వద్ద ఆయా భూములను మద్యం, మాంసం అమ్మే ప్రైవేట్ హోటల్స్‌కు కట్టబెట్టేందుకు, 33ఏళ్ల లీజు కు ఇచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని చెప్పారు.


