ఒకసారి పరీక్షల్లో ఉత్తీర్ణత కాకున్నాఉన్నత స్థానాలకు ఎదగొచ్చు చదువు జీవితంలో ఒకభాగం మాత్రమే మార్కుల కోసం తల్లిదండ్రులు ఒత్తిడి చేయరాదు రూ.లక్షల్లో ఫీజులు చెల్లించామని పదే పదే అనొద్దు
ఆత్మహత్యతో ఏమీ సాధించలేరు
లబ్బీపేట(విజయవాడతూర్పు): మార్కులే జీవితం కాదు. చదువు జీవితంలో ఒక భాగం మాత్రమే. తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించలేని ఎందరో భవిష్యత్‌లో ఉన్నత స్థానాలకు ఎదిగారు. ఉత్తీర్ణత సాధించలేదని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెందకుండా పట్టుదలతో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. బుధవారం విడుదలైన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వచ్చాయన్న మనస్తాపంతో కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఓ బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఫెయిలయ్యానన్న మనస్తాపంతో ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లులో ఓ బాలిక ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను కుటుంబ సభ్యులు గుర్తించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలిక చికిత్స పొందుతోంది. ఇంటర్మీడియెట్, పదో తరగతి ఫలితాలు వెల్లడైన ప్రతిసారి కొందరు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చా యన్న మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడటం చూస్తూనే ఉన్నాం. అందుకు వారు చదువులో ఎదుర్కొంటున్న ఒత్తిడి, తల్లిదండ్రులు ప్రభావం కూడా ఉంటోందని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. రూ.లక్షల్లో ఫీజులు చెల్లిస్తున్నాం, అన్ని మార్కులు రావాలి, ఇన్ని మార్కులు రావాలి అంటూ తల్లిదండ్రులు తమ ఆశలను పిల్లలపై రుద్దుతున్నారు. దీంతో కొందరు పిల్లలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫలితంగా తమ తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చలేకపోయామన్న బాధతో ఆత్మహత్మలకు పాల్పడుతున్నారు. ఈ విధానం మారాలని, మార్కులు ప్రామాణికం కాదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు.
చదువు ఒక్కటే జీవితం కాదు
చదువు ఒక్కటే జీవితం కాదు. జీవితంలో ఒక భాగం మాత్రమే. చదువులో రాణించలేక పోయినా, ఇతర వృత్తుల్లో రాణించి ఉన్నత స్థానానికి ఎదిగిన వారు అనేక మంది ఉన్నారు. ఒకసారి ఫెయిలైన వారు, తర్వాత పట్టుదలతో పరీక్షలు రాసి ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎందరో ఉన్నారనే వాస్తవాన్ని విద్యార్థులు గ్రహించాలి. ఆత్మహత్యలకు పాల్పడి తమ తల్లిదండ్రులకు తీరని కడుపుకోత మిగల్చడం సరికాదు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన పిరికితనంతో చేసే చర్యగా నిపుణులు చెబుతున్నారు.
తల్లిదండ్రుల పాత్రే కీలకం
విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటంతో తల్లిదండ్రుల పాత్రే కీలకమని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లల అభిప్రాయాలతో సంబంధం లేకుండా కొందరు తల్లిదండ్రులు రూ.లక్షల ఫీజులు చెల్లించి కార్పొరేట్ కాలేజీల్లో చేరుస్తున్నారు. రూ.లక్షల్లో ఫీజులు కడుతున్నాం, మంచి మార్కులు రావాలంటూ పదే పదే పిల్లలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో కొందరు పిల్లలు మానసికంగా కుంగిపోయి, ఫెయిలైనా, మార్కులు తక్కువ వచ్చినా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రుల్లో మార్పు రావాలని, తమ పిల్లలు ఫెయిలైనా మరో అవకాశం ఉంన్న ఓదార్పుతో మాట్లాడాలని సూచిస్తున్నారు. ఇతర పిల్లలతో పోల్చడం చేయకూడదని హెచ్చరిస్తున్నారు. తమ పిల్లలను డాక్టరో, ఇంజి నీరో చేయాలని తల్లిదండ్రులు భావించడంతో తప్పులేదు. అయితే పిల్లల అభిప్రాయాలను తెలుసుకుని, వారు చదువులో రాణించగలరో లేదో అంచనా వేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలే దనో, తక్కువ మార్కులు వచ్చాయనో ఆత్మహత్యకు పాల్పడి సాధించేది ఏమీ లేదు. తల్లిదండ్రులకు విషాదాన్ని మిగల్చడమే. ఏదైనా జీవించి సాధించాలి. ఒకసారి ఫెయిలైనా మళ్లీ పట్టు దలతో చదివి ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. జీవితంలో ఎదిగేందుకు మార్కులు ఒక్కటే ప్రామాణికం కాదు. చదువులో రాణించలేని వారు రాజకీయాల్లో, వ్యాపారాల్లో, వివిధ వృత్తుల్లో రాణిస్తున్న వారు ఎందరినో చూస్తున్నాం. మనకు నచ్చిన రంగంలో రాణించే అవకాశం ఉంది. ఆత్మహత్యలతో జీవితాలను అర్ధంతరంగా ముగించొద్దు.
– డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్,
విజయవాడ


