బాలికలపై పెరిగిన లైంగికదాడులు | - | Sakshi
Sakshi News home page

బాలికలపై పెరిగిన లైంగికదాడులు

Apr 10 2026 10:45 AM | Updated on Apr 10 2026 10:45 AM

బాలికలపై పెరిగిన లైంగికదాడులు ● రోజుకో అమానవీయ సంఘటన ● ఇంటాబయట బాలికలకు రక్షణ కరువు ● పెరిగిపోతున్న పోక్సో చట్టం కేసులు

భరోసా కల్పించాలి

అమ్మో.. మృగాళ్లు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అతను విద్యాబుద్ధులు నేర్పే గురువు. చదువుకునేందుకు వచ్చిన చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక అస్వస్థతకు గురికావడంతో అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ బాలిక ప్రైవేట్‌ పార్టులో పేపర్‌ ముక్కలు ఉన్నట్లు గుర్తించారు. బాలికను అమ్మమ్మ నిలదీయడంతో జరిగిన విషయం బయటపెట్టింది. ఈ అమాన వీయ ఘటన జరిగింది ఏ మారుమూల తండాలోనో కాదు. సాక్షాత్తూ విద్యలవాడగా పేరుపొందిన విజయవాడలో, అదీ పాఠశాలలో కావడం ఆందోళన కలిగిస్తోంది. విజయవాడలో నాలుగేళ్ల చిన్నారి ఇంటి ముందు సైకిల్‌ తొక్కుతుండగా అదే వీధిలో ఉంటున్న 45 ఏళ్ల వ్యక్తి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటికి తిరిగొచ్చి పాపతో అదే తీరుగా ప్రవర్తించాడు. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో జరిగిన ఈ ఘటన బాలికల రక్షణకు సవాల్‌గా మారింది. ఇటీవల విజయవాడలో బాలిక ప్రైవేటు భాగాల్లో యాసిడ్‌ పోసిన ఘటన సంచలనంగా మారింది. చిన్నారుల మంచి చెడ్డలు చూడాల్సిన డే కేర్‌ సెంటర్‌లోనే జరిగిన ఈ ఘటన బాలికల తల్లిదండ్రులను కలవర పెడుతోంది. మచిలీపట్నంలో 17 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైలవరంలో మరో బాలికపై లైంగికదాడి జరిగింది. ఇలా బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, దాడులు నిత్య కృత్యమయ్యాయి.

‘ఆడబిడ్డలపై చేయివేస్తే అదే వారికి ఆఖరి రోజు అవుతుంది’ అంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. ‘శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. బాలికలు, మహిళలకు ఈ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంది’ అంటూ హోంమంత్రి అనిత సాక్షాత్తూ చట్టసభల్లోనే గొప్పలు చెప్పారు. వారి మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. నిత్యం ఏదో ఒక మూల మూడేళ్ల బాలిక నుంచి ముదుసలి వరకు లైంగికదాడులకు గురవుతూనే ఉన్నారు. ఎన్టీఆర్‌ జిల్లాలో రెండేళ్ల కాలంలో 196 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఏటేటా ఈ కేసులు రెట్టింపవుతున్నాయి. బాలికలు, మహిళలకు ఇంటాబయట రక్షణ కరువైంది. అభం శుభం తెలియని చిన్నారులపై మృగాళ్లు లైంగికదాడులకు తెగబడుతున్నారు. కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తుండగా, మరి కొన్ని ఘటనల్లో ఆడపిల్లల తల్లి దండ్రులు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయడానికి భయపడిపోతున్నారు. మరి కొన్ని ఘటన లను ప్రైవేటు పంచాయితీల్లో సర్దుబాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

వరుసగా అమనవీయ ఘటనలు

పోలీసు కమిషనరేట్‌ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌ పరిధిలో వరుసగా మూడు రోజుల వ్యవధిలో మూడు అమానవీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ మూడు ఘటనల్లోనూ పోలీసుల తీరు అనుమానాస్పదంగా మారింది. రెండు కేసుల్లో ఘటన జరిగిన 15 రోజుల వరకు నిందితులను అరెస్ట్‌ చేయలేదు. అన్నివైపుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందితులను అరెస్ట్‌ చేశారు. ఎస్సీ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. బాలిక తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. మరో కేసులో సెక్షన్‌లు మార్చి ఎఫ్‌ఐఆర్‌ ఆల్టర్‌ చేసినట్లు సమాచారం. బాలికల రక్షణపై పాలకుల ప్రకటనలు ఒకలా ఉంటే, కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు తీరు మరోలా ఉంది. బాలికలపై దారుణాలన్నీ ఇంటి ముందు వీధిలోనో, ఇంటి ఆవరణలోనో, బడిలోనో జరిగినవే. ఈ ఘటనల్లో నిందితులు బంధువులో, ఇరుగు పొరుగు వారో కావడంతో ఆడపిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు రక్షణ ఎలా అని ఆందోళన చెందుతున్నారు. శాంతి భద్రతలు అధ్వానంగా మారాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహిళలపై జరిగిన దాడులు అనేకం. వెలుగులోకి వచ్చినా చర్యలు ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

రెండేళ్లుగా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. బాలికలు, మహిళలకు రక్షణ కరువైంది. నడిరోడ్డుపై మహిళలపై కొందరు దారుణంగా దాడులు చేస్తున్నారు. చిన్నారులను చిదిమేస్తున్నారు. గత ప్రభుత్వంలో దిశ యాప్‌ ద్వారా రక్షణ కల్పించారు. మహిళల భద్రతకు అప్పటి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రస్తుతం మహిళల భద్రతను గాలికొదిలేశారు. పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలి. బాలికలు, మహిళలకు భరోసా కల్పించాలి

– సౌమ్య, న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement