భవానీపురం(విజయవాడపశ్చిమ): దేశ ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నా యని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ పేర్కొన్నారు. వివిధ స్థాయిల్లో సమగ్ర, నాణ్యమైన వైద్య సేవలు అందించి, వైద్య పరిశోధనలను బలో పేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరబ్ గౌర్, ఎన్టీఆర్ జిల్లా కలె క్టర్ డాక్టర్ జి.లక్ష్మీశతో కలిసి విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్‌ను ఆమె గురువారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందిస్తున్న ఆరోగ్య సేవలు, వ్యాధుల గుర్తింపు పరీక్షలు, సకాలంలో చికిత్స తీసుకునేలా ప్రోత్సహించడం వంటి సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. టీబీ వ్యాధి నిర్ధారణకు అనుసరిస్తున్న విధానాలతోపాటు టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల ప్రచార కార్యక్రమం అమలును పరిశీలించారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన పోర్టబుల్ ఎక్స్‌రే వ్యవస్థను పరిశీలించారు. క్షయ రోగులకు పోషక ఆహార కిట్లను అందజేశారు.
సత్వర వైద్య సేవలు
పుణ్య సలీలా శ్రీవాస్తవ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలను అను సంధానం చేస్తూ దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా ప్రజలకు సత్వర వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డిసెంబర్ 2024లో ప్రారంభమైన రెండో విడత ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ ద్వారా గణనీయమైన ఫలితాలు సాధించామన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ జాయింట్ సెక్రటరీ రోణంకి గోపాలకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ జన రల్ (సెంట్రల్ టీబీ డివిజన్) రఘురామ్‌రావు, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యేశ్వరి, జేడీ (ఎన్‌టీఈపీ) డాక్టర్ రమేష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎం.సుహాసిని తదితరులు పాల్గొన్నారు.


