బెజవాడలో మహిళ దారుణ హత్య
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బెజవాడలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.. భార్యకు అండగా ఉంటుందనే అక్కసుతో ఓ అల్లుడు తన అత్తను అత్యంత కిరాతకంగా.. పేగులు బయటకు వచ్చేలా.. తల తెగి ఊడిపోయేలా పొడిచి చంపిన ఘటన అజిత్‌సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి కలకలం సృష్టించింది.
ప్రేమించి పెళ్లి చేసుకొని..
సింగ్‌నగర్ పోలీస్‌స్టేషన్ సమీపంలోని న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన కోళ్ల దుర్గ(46), అప్పారావు దంపతులు నివసిస్తున్నారు. వీరికి కొమ్మూరు కామాక్షి, కొమ్మూరి దుర్గాభవాని అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కామాక్షికి ఏలూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిపించగా దుర్గాభవాని దేవినగర్ మధ్యకట్టలో ఉంటున్న కొమ్మూరి నాగసాయి అనే వ్యక్తిని ప్రేమించి ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకుంది. వీరికి మహదేవ్(7), ప్రణతి(3) సంతానం. నాగసాయి నిత్యం గంజాయి, మద్యం విచ్చలవిడిగా సేవించి భార్యను కొట్టడం, కత్తులు, బ్లేడ్లతో కోసి నరకయాతనకు గురిచేసేవాడు. దీంతో అతడి చేష్టలతో విసుగుపోయిన దుర్గాభవాని కొంతకాలం భర్తకు దూరంగా ఉంది. తన తల్లి దుర్గ మాటలు విని గత నెలలోనే మళ్లీ భర్త దగ్గరకు వెళ్లింది. అయినా కూడా నాగసాయి ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. భార్య దుర్గాభవానిని అదే రీతిలో ఇష్టం వచ్చినట్లుగా హింసిస్తూ ఉన్నాడు. శనివారం కూడా ఇదే విధంగా ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టి చంపేస్తానని బెదిరించడంతో భయపడిపోయిన దుర్గాభవాని న్యూఆర్‌ఆర్‌పేటలోని తన తల్లి దుర్గ దగ్గరకు వచ్చి జరిగిన విషయాన్ని చెప్పింది.
పేగులు బయటకు వచ్చేలా దాడి
భార్యకు సహకరిస్తుందనే కక్షతో నాగసాయి తన అత్త దుర్గను హత్య చేసేందుకు పన్నాగం పన్నాడు. ఆదివారం రాత్రి దుర్గ ఉంటున్న ఇంటికి తన స్నేహితుడితో కలిసి బైకుపై వచ్చిన నాగసాయి అత్త దుర్గ ఇంట్లో ఉందని తెలుసుకొని వెళ్లి తన భార్య ఆచూకీ గురించి అడిగాడు. దీనికి ఆమె తన కూతురు ఇక్కడకు రాలేదని చెబుతుండగానే ముందుగానే తనతో తెచ్చుకున్న కత్తితో దుర్గపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. పొట్టలో పేగులు బయటకు వచ్చేలా పొడిచి అంతటితో ఆగకుండా ఇంట్లో అద్దం పగలకొట్టి ఆ ముక్కలతో అతి కిరాతకంగా హతమార్చాడు.
ప్రాణభయం ఉందని చెప్పినా పట్టించుకోలేదు..
తన భర్త నుంచి తమకు ప్రాణభయం ఉందని దుర్గాభవాని సింగ్‌నగర్ పోలీసులను ఆదివారం మధ్యాహ్నం ఆశ్రయించింది. పోలీసులు సరిగా పట్టించుకోలేదని మృతురాలు కుమార్తె దుర్గాభవాని, మేనకోడలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దుర్గ హత్యతో న్యూరాజరాజేశ్వరీపేట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సమాచారం అందుకున్న నార్త్‌జోన్ ఏసీపీ స్రవంతిరాయ్, సీఐ వెంకటేశ్వర్లు క్లూస్‌టీం సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరిస్తున్నారు.
అత్తను అతి కిరాతకంగా పొడిచి చంపిన అల్లుడు


