ప్రగతి సూచికల లక్ష్యాలను సాధించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): స్వర్ణాంధ్ర విజన్ @ 2047కు సంబంధించిన కీలక ప్రగతి సూచికల లక్ష్యాలను అన్ని శాఖలు పూర్తిస్థాయిలో సాధించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులకు సూచించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్–కేపీఐల లక్ష్యాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొన్ని శాఖలు బీ,సీ గ్రేడులలో ఉన్నాయని, ఇవి తప్పనిసరిగా ఏ–గ్రేడ్‌లోకి రావాలని ఆదేశించారు. వీఎంసీ, పోలీస్, ఆరోగ్య, విద్యా, సహకార శాఖలు మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. సాధించిన ప్రగతి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేయాలని అధికారులకు సూచించారు. ఎలక్ట్రానిక్ ఆరోగ్య రికార్డులను (ఈ–హెచ్‌ఆర్) పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఎంపీడీవోలు, మండల ప్రత్యేక అధికారులు వారానికి ఒకసారి అంగన్‌వాడీలను తనిఖీ చేయాలని, అందరికీ పోషకాహారం అందేలా చూడాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్.ఇలక్కియ, ముఖ్య ప్రణాళిక అధికారి వై. శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
మోపిదేవి/పెదకళ్లేపల్లి(మోపిదేవి): ప్రసిద్ధ శైవక్షేత్రాలుగా విరాజిల్లుతున్న మోపిదేవిలోని శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, దక్షిణకాశీగా పేరుగాంచిన పెదకళ్లేపల్లిలోని శ్రీదుర్గాపార్వతీ సమేత నాగేశ్వరస్వామివారిని దేవదాయ ధర్మదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్‌లాల్ సతీసమేతంగా మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న వారికి ఆయా దేవస్థానాలలో ఘనస్వాగతం లభించింది. తొలుత మోపిదేవిలో ఆలయ ప్రదక్షిణ చేసిన అనంతరం నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడి చెల్లించుకున్నారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు స్వామివారి చిత్రపటం, లడ్డుప్రసాదం అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం ఇంద్రకీలాద్రిపై విశేష పూజలతో పాటు పలు కార్యక్రమాలు జరగనున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5.55గంటలకు దుర్గగుడి ఘాట్‌రోడ్డులోని కామథేను అమ్మవారి ఆలయం నుంచి ఇంద్రకీలాద్రి గిరిప్రదక్షిణ ప్రారంభమవుతుంది. శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులతో పాటు దేవస్థాన ప్రచార రథంతో భక్తులు, సేవా సిబ్బంది గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు. ఇక సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం నిర్వహించేందుకు వైదిక కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది కోటి దీపోత్సవంలో భక్తులు పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం నిలిసివేసింది. కోటి దీపోత్సవం అనంతరం మల్లేశ్వర స్వామి వారి ఆలయం వద్ద జ్వాలాతోరణం కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అలాగే మల్లేశ్వర స్వామి వారికి త్రికాల అర్చనలు, సహస్ర లింగార్చన, పంచహారతుల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ, ఊంజల్ సేవలు జరుగుతాయి.
నాగాయలంక: ఢిల్లీ సైన్స్ ఎక్స్‌పోజర్ ఎడ్యుకేషనల్ టూర్‌కు నాగాయలంక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ పదో తరగతి విద్యార్థులు చాపల మోక్షజ్ఞ, సనకా తేజసాయి ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం అలపర్తి సత్యనారాయణ మంగళవారం తెలిపారు. విద్యార్థులలో సృజనాత్మకత, ఆవిష్కరణలు పెంపొందించే క్రమంలో ఏసీ సైన్స్ సిటీ సహకారంతో ప్రతి జిల్లా నుంచి ఇద్దరేసి చొప్పున ఎంపిక చేసిన 52మందిలో కృష్ణాజిల్లా తరఫున ఈ ఇద్దరు విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తారని పేర్కొన్నారు. ఈనెల 6, 7, 8 తేదీల్లో ఢిల్లీలోని రష్యన్ సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ కల్చరల్, నేషనల్ సైన్స్ మ్యూజియం, నెహ్రూ ప్లానిటోరియంలను సందర్శిస్తారని.. అలాగే నాసా, ఇస్రో సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలతో చర్చాగోష్టిలో పాల్గొంటారని ఆయన వివరించారు.
ప్రగతి సూచికల లక్ష్యాలను సాధించాలి
ప్రగతి సూచికల లక్ష్యాలను సాధించాలి


