నూతన టెర్మినల్ నిర్మాణం వేగవంతం చేయాలి
ఎయిర్‌పోర్ట్(గన్నవరం): విమానాశ్రయంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మాణాన్ని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తిచేసేందుకు పనులను వేగవంతం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. స్థానిక విమానాశ్రయంలో మంగళవారం ఆయన నూతన టెర్మినల్ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు, భూసమీకరణ సమస్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధి పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. నూతన టెర్మినల్ భవన నిర్మాణానికి సంబంధించి మౌలిక వసతుల పనులను త్వరితగతిన పూర్తిచేయాల న్నారు. విమానాశ్రయ విస్తరణలో నెలకొన్న భూసమస్యలు, కోర్టు వివాదాలు, ఏలూరు కాలువపై వంతెన నిర్మాణం, రైతులకు పరిహారం చెల్లింపు వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ నూతన టెర్మినల్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ జనరల్ మేనేజర్ రామాచారి, డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి, గుడివాడ ఆర్డీఓ జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు కేవీ శివయ్య, పంచాయతీరాజ్ ఎస్‌ఈ రమణరావు, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ సోమశేఖర్, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక అవసరాల పిల్లలకు ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాలు
మచిలీపట్నం అర్బన్: కృష్ణాజిల్లాలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఆరు ప్రాంతాల్లో ఉచిత ఉపకరణాల నిర్ధారణ శిబిరాలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్ష కృష్ణాజిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఆర్.కుముదిని సింగ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6న మచిలీపట్నం, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల పిల్లల కోసం మచిలీపట్నంలోని పాండురంగ మున్సిపల్ హైస్కూలో, 7న గుడివాడ, నందివాడ, గుడ్లవల్లేరు, పెదపారుపూడి మండలాలకు గుడివాడలోని శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హైస్కూల్లో, 10న గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు మండలాలకు గన్నవరంలోని జెడ్పీ గరల్స్ హైస్కూల్లో శిబిరాలు ఉంటాయన్నారు. నవంబరు 11న అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల మండలాలకు చల్లపల్లిలోని జెడ్పీ హైస్కూల్లో శిబిరాలు నిర్వహిస్తామన్నారు. నవంబరు 12న పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలకు కంకిపాడులోని జిల్లా పరిషత్ హైస్కూల్ వేదికగా నవంబరు 13న పామర్రు, మొవ్వ, తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల పిల్లల కోసం పామర్రులోని జిల్లా పరిషత్ హైస్కూల్లో శిబిరాలు ఉంటాయన్నారు.


