గుర్తు తెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి
కంచికచర్ల: పచారి సరుకులు తీసుకుని స్కూటీపై ఇంటికి వెళుతున్న కిరాణా వ్యాపారిని వెనుకనుంచి వేగంగా వస్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ పి.విశ్వనాఽథ్ కథనం మేరకు ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కామా ముత్యాలరావు(46) కంచికచర్లలో పచారి సరుకులు కొనుగోలు చేసి స్కూటీపై గ్రామానికి బయలుదేరాడు. మండలంలోని పరిటాల సమీపంలోని కాళీమాత ఆలయం సమీపంలోకి వెళ్లగానే నేషనల్ హైవేపై ముందు వెళుతున్న స్కూటీని హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపునకు వెళుతున్న గుర్తు తెలియని వాహనం వెనుకనుంచి వేగంగా ఢీకొంది. ఈ ఘటనలో వ్యాపారి తలకు తీవ్రగాయాలవటంతో అధిక రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రూ.2లక్షలు మోసం చేసిన డ్రైవర్‌పై కేసు నమోదు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): సంస్థను మోసం చేసిన డ్రైవర్‌పై భవానీపురం స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు...చీతిరాల ఎడిబుల్ ఆయిల్స్ అండ్ ఫుడ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలో దేవత్ వీరన్న డ్రైవర్‌గా పనిచేశాడు. కంపెనీకి సంబంధించి 10 వాహనాలు ఉన్నాయి. వీటన్నింటికి కార్డు ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆయిల్ వినియోగిస్తుంటారు. ఈ సంస్థలో వీరన్న కొంత కాలం డ్రైవర్‌గా పనిచేసి మానేశాడు. ఆ తర్వాత మరలా వచ్చి తనకు ఉద్యోగం కావాలంటూ రోజూ సంస్థ ప్రతినిధులను బతిమాలడం ప్రారంభించాడు. ఆలా రోజూ సంస్థ కార్యాలయానికి వస్తూ నమ్మకంగా సంస్థ వాహనాల్లోని ఆయిల్ కార్డును వినియోగించి ఇతర వాహనాలకు డీజిల్ కొట్టించి వారి వద్ద డబ్బులు వసూలు చేశాడు. ఆ విధంగా రూ.2లక్షలకు పైగా వసూలు చేసి సంస్థను మోసం చేశాడు, దీనిపై సంస్థ ఎండీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
గన్నవరం: మండలంలోని దావాజిగూడెంలో ఉన్న మద్యం దుకాణం సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం... వైన్‌షాపు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిచ్చిమొక్కల మధ్య ఓ మహిళ మృతదేహం పడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ బీవీ శివప్రసాద్ నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకుని మృతురాలు రాజీవ్‌నగర్‌కు చెందిన నక్క వెంకటేశ్వరమ్మ(48)గా గుర్తించారు. ఆమె భర్త చనిపోవడంతో పెట్రోల్ బంక్ సమీపంలోని ఓ హోటల్ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే గత మూడు రోజులుగా ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైన్‌షాపునకు సమీపంలో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతదేహం ఉబ్బిపోయి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో రెండు రోజుల క్రితమే ఆమె మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మద్యం తాగేందుకు తరుచూ సదరు వైన్‌షాపునకు వస్తుంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే వెంకటేశ్వరమ్మ మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలి ఒంటిపై దుస్తులు సరిగ్గా లేకపోవడంతో ఎవరైనా లైంగికదాడికి పాల్పడి హత్య చేసి ఉండవచ్చని అంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతురాలికి ఇరువురు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల అనుమానం మేరకు పోలీసులు క్లూస్ టీమ్‌ను రంగంలోకి దింపి ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని కిరాణా వ్యాపారి మృతి


