
ఖేలో ఇండియా రాష్ట్ర జట్లు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: ఏడో ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అండర్–18 కబడ్డీ (బాలుర), ఖోఖో (బాలుర), ఫుట్‌బాల్(బాలికల) జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించే రాష్ట్ర జట్లను ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో బుధవారం ఎంపిక చేశారు. కబడ్డీకి 49 మంది, ఖోఖో పోటీకి 45 మంది, ఫుట్‌బాల్‌కు 49 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ (టెక్నికల్) రమణ పర్యవేక్షణలో స్పోర్ట్స్ ఆఫీసర్‌లు సురేంద్ర, కోటేశ్వరరావు, ఎన్టీఆర్ జిల్లా డీఎస్‌డీవో ఎస్.ఎ.అజీజ్ ఈ పోటీలు నిర్వహించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడాకారుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ముందుగా ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. మధ్యాహ్నం నుంచి జరిగిన ఎంపిక పోటీలను శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించారు. ఈ పోటీలకు పరిశీలకులుగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి అసోసియేషన్‌ల ప్రతినిధులు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ), నామినేటెడ్ స్పోర్ట్స్ పర్సన్స్ వ్యవహరించారు. జట్లకు ఎంపికై న క్రీడాకారులు మే 2 నుంచి 15వ తేదీ వరకు బీహార్‌లో జరిగే ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2025 జాతీయ పోటీల్లో పాల్గొంటారని శాప్ ఎండీ పి.ఎస్.గిరీషా వెల్లడించారు.