
మహనీయుడు అంబేడ్కర్
భవానీపురం(విజయవాడపశ్చిమ): సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం ప్రాతిపదికన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని రాష్ట్ర ఆరోగ్య, వైద్య శాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశతో కలిసి తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దగల అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ సామాజికవేత్తగానే కాకుండా ఆర్థికవేత్తగా, న్యాయనిపుణుడిగా అంబేడ్కర్ దేశానికి విశిష్ట సేవలు అందించారని అన్నారు. ఇతర దేశాలతో పోల్చుకుంటే మనది భిన్నమైన రాజ్యాంగమని, బడుగు, బలహీనవర్గాల ఉన్నతికి వీలుగా ఎంతో విపులంగా రచించారని కొనియాడారు.
అంబేడ్కర్ స్ఫూర్తితో ఉన్నత శిఖరాలకు..
స్వయం కృషి, స్వీయ ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచనలు చదవటానికి మన జీవిత కాలం సరిపోదని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతామని తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ జగదీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, దళిత నాయకులు జి. కిశోర్‌కుమార్, ఎం. క్రాంతి, ఎన్. బాలాజి, బి. దేవదాస్, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
సత్యకుమార్ యాదవ్