
అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితో పాలించిన జగన్
భవానీపురం(విజయవాడ పశ్చిమ): అంబేడ్కర్ ఆశయ స్ఫూర్తితోనే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగించారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ అన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్ద పీట వేసి అధికారంలో భాగస్వాములను చేశారని గుర్తు చేశారు. భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్ సీపీ వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డిలతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ప్రైవేటు పరం చేస్తే ఉద్యమిస్తాం : వెలంపల్లి
విజయవాడ నడిబొడ్డున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్మృతివనాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్‌పరం చేస్తే ఉద్యమిస్తామని వైఎస్సార్ సీపీ పొలిటికల్ ఎడ్వైజరీ కమిటీ సభ్యుడు వెలంపల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. భారత రాజ్యాంగ రూపకల్పనతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింప చేసిన అంబేడ్కర్ విగ్రహం విజయవాడలోనే ఉండాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 125 అడుగుల ఎత్తులో నగర నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేశారని అన్నారు. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం చట్ట సవరణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనలను తు.చ తప్పకుండా అమలు చేసిన ఏకై క ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనని అన్నారు. గౌతంరెడ్డి మాట్లాడుతూ సమాజంలో అసమానతలు తొలగిపోయి సమసమాజం ఏర్పడాలన్నదే అంబేడ్కర్ ఆలోచనా విధానమని అన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కాలే పుల్లారావు, ఎమ్మెల్సీ రుహుల్లా, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఆసిఫ్, డెప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతు శ్రీశైలజరెడ్డి, వైఎస్సార్ సీపీ నేత పోతిన వెంకట మహేష్, పలువురు కార్పొరేటర్లు, ఎస్సీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్