తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు జయంతి

Remember Telangana Bhagat Singh Anabheri Prabhakar Rao Birth Anniversery - Sakshi

నేడు తెలంగాణ షేర్ అనభేరి ప్రభాకర్ రావు గారి జయంతి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి తెలుసుకుందాం. 1910 ఆగస్టు 15 వ తేదీన కరీంనగర్ జిల్లా పోలంపల్లి వాస్తవ్యులైన దేశ్ ముఖ్, జమీందార్ అనభేరి వెంకటేశ్వర్ రావు, రాధాదేవి దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. వీరు కరీంనగర్‌లో ప్రాథమిక విద్య తరువాత మచిలీపట్నంలో కొంతకాలం చదివి తరువాత, హైదరాబాద్ చాదర్ ఘాట్ హై స్కూల్ మరియు బనారస్ కాశీ విద్యాపీట్‌లో ఉన్నత చదువులు చదువుకున్నారు. స్వతహాగా ఆదర్శ భావాలు కలిగిన ఆయన విద్యార్ధి దశ నుంచే నిజాం వ్యతిరేఖ ఉద్యమం వైపు ఆకర్షితులయారు. ఇంకా పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం ఉన్నా వీరు వెళ్ళలేదు, అందరు దొరల కొడుకుల్లాగా దొరతనాన్ని ఎంచుకోలేదు. విలాస వంతమైన దేశ్ ముఖ్ జీవితం వైపు మొగ్గుచూపలేదు, ఆడంబరమైన జమీందారీ అధికారాలకి ఆకర్షితులవ్వలేదు. 

కార్య‌క‌ర్త‌ల పాలిట అన్న‌పూర్ణ‌మ్మ‌గా అన‌భేరి స‌తీమ‌ణి
అనభేరికి తన 27 వ ఏట అప్పటి చెన్నూర్ తాహసీల్దార్ శ్రీ వెల్ముల నారాయణ రావు, లక్ష్మీ నర్సుభాయి చిన్న కుమార్తె సరళా దేవితో పెళ్లి అయింది. అనభేరి గురించి విన్న‌ సరళా దేవి ఆయన ఆదర్శాలకు ఆకర్షితురాలై ఇంట్లో వాళ్ళను ఒప్పించి ఆయనకు భార్య అయ్యారు. అంతే కాకుండా ఆ కాలంలో 8వ తరగతి వరకు చదువుకొన్న ఆమె అనభేరికి అన్ని విధాల సహకరించేవారు. భర్తతోపాటు మీటింగుల్లోనూ, సభల్లోనూ, ప్రతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఆంధ్ర మహాసభ కార్యక్రమాల్లో, సమావేశాల్లో వీరిద్దరూ పాటల రూపంలో ప్రజలను ఉత్తేజ పరిచేవారు. తమ ఇంటికి వచ్చే లెక్కలేనతమంది పార్టీ కార్యకర్తలకి అన్నపూర్ణమ్మలా స్వయంగా పనివాళ్ళ సాయం లేకుండా భోజనాలు సమకూర్చేవారు. జనానికి స్ఫూర్తి ప్రభాకర్ రావు ఐతే, ఆయన స్ఫూర్తికి మూలం సరళాదేవి అయ్యారు. (ముగ్గురు చిన్నారులను కాపాడి.. తన ప్రాణాలు వదిలాడు)

దాసీల‌కు ద‌గ్గ‌రుండి పెళ్లిళ్లు చేశారు
1938లో ఆంధ్రమహాసభకు జిల్లా సెక్రెటరీగా పనిచేసిన అనభేరి హైదరాబాద్‌లో జరిగిన ఆంధ్రమహాసభ ప్లీనరీలో ప్రముఖ పాత్ర పోషించారు. తాను ధనిక, పెత్తందారీ వర్గానికి చెందిన వాడినని, పేద ప్రజలు తన వ్యతిరేక వర్గానికి చెందిన వాళ్ళని ఆయన అందరు దొరల్లాగ ఆలోచించలేదు.తాను తినే పంచభక్ష్య పరమాన్నాల్లో ఆయనకు పేదవాడి రక్తం, ఆకలి కనిపించింది, పట్టుపరుపుల మీద పడుకునే ఆయనకు పేదవాడి అప్పుల సెగ తగిలింది, తన చుట్టూ ఉన్న దాసీలలో కనిపించిన‌ స్త్రీ జాతి సంకెళ్ళు ఆయనను కదిలించాయి, పాలేర్ల వెట్టి బ‌తుకుల్లోని భారం ఆయనను వెన్ను తట్టింది. ఆదర్శ మూర్తి ఐన ప్రభాకర్ రావు తన ఇంటి నుంచే త‌న‌ ఆదర్శాలను అమలు చేశారు. పాలేర్ల పిల్లలకు చదువులు చెప్పించారు, తమ ఇంట్లోని దాసీలకు పెళ్ళిళ్ళు చేసి పంపించడమే కాకుండా వారికి ఇళ్లు కట్టించి, దాస్య శృంఖలాలను తెంచి వేసి వాళ్ళ జీవితాల్లో స్వేచ్చా వెలుగులు నింపి, స్త్రీ జాతికి గౌరవాన్ని అందచేసి మహా పురుషుడయ్యారు.  అనభేరి ఆర్య సమాజ్ ఆచరించి ఇంట్లో అందరిని ఆచరింప చేసారు. మాంసంతో పాటు మద్యాన్ని కూడా నిషేదింపజేసారు. ప్రతి దసరాకు తమ జమీన్దారీకి 66 ఊర్ల నుంచి వెట్టిగా/ కానుకగా వచ్చే గొర్రె పిల్లలను మానిపించారు.

నేత‌న్న‌ల‌ను ఆదుకున్న అన‌భేరి
ఆ రోజుల్లో రజాకార్ల అమానుషత్వానికి గుర‌వుతున్న ప్రజల బ‌తుకులు అనభేరిని కదిలించాయి. ప్రజలకు చదువు నేర్పి వాళ్ళను చైతన్యవంతులను చేయడానికి ఆయన కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో వయోజనుల కోసం నైట్ స్కూల్ ను ఏర్పాటు చేశారు. ఊర్లో ధాన్యం దొరకక ఇబ్బంది పడుతున్నరైతులకోసం ప్రభాకర్ రావు గ్రెయిన్ బ్యాంకు నెలకొల్పి రైతులకు విత్తనాలను, ధాన్యాలను అందజేసేవారు. రైతులను చైతన్య పరిచేందుకు రైతు మహాసభలు నిర్వహించేవారు. ఇలా ఎంతోమంది అన్నదాతలను ఆదుకొన్నారు. నూలు దొరక్క‌, మగ్గం ఆడక బ‌తుకు బండి న‌డప‌డ‌మే క‌ష్ట‌మ‌వుతున్న‌ నేతన్నలను ఆదుకోవడానికి ఊర్లలో సహకార సంఘాలు స్థాపించి హైదరాబాద్ కమీషనర్ నుండి పెట్టెల్లో నూలు తెచ్చి, చేనేత కార్మికులకు రేషన్ కార్డ్స్ ఇప్పించి వాటి ద్వారా నూలు అందించేవారు. ఇది సిరిసిల్ల కేంద్రంగా ఉండేది. ఇలా ప్రభాకర్ రావు దాదాపు 40 వేల మందికి రేషన్ కార్డ్స్ ఇప్పించారు.

పటేల్ పట్వారీల వ్యవస్థకి వ్యతిరేకంగా దాడి
అనభేరి 1942 నుంచి 1946 వరకు 5 సంవత్సరాలు రాష్ట్ర చేనేత సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి ఆయన ఎంతోమంది చేనేత కార్మికులను ఆకలి చావుల నుండి తప్పించి వారికి ఒక కొత్త‌ జీవితాన్ని ఏర్పాటు చేసి, వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీకి జిల్లా నుంచి మొదటి వ్యక్తిగా నాయకత్వం వహించారు. సాయుధ పోరాటంలో భాగంగా వందలాది మందితో ఏర్పడ్డ దళానికి అనభేరి నాయకత్వం వహించి ఆదిలాబాద్, విజయవాడ, సిర్వంచ, చాందా, కరీంనగర్ దళాలకు సహచరుడు సింగిరెడ్డి భూపతి రెడ్డితో కల్సి శిక్షణ ఇచ్చారు. 40 గ్రామాల్లో పటేల్ పట్వారీల వ్యవస్థకి వ్యతిరేకంగా దాడి చేసి దస్తావేజుల్ని కాల్చివేయడం ద్వారా రైతుల అప్పు పత్రాల్ని, దొంగ పట్టాలు, భూమి పత్రాల్ని ఇతర పన్ను పత్రాల్ని కాల్చివేసి పెత్తందార్ల అమానుశత్వానికి గుర‌వుతున్న పేద రైతులను కాపాడి వాళ్ళను శాపవిముక్తుల్ని చేశారు.

ప‌ద‌వి ఆశ చూపినా లొంగ‌ని అన‌భేరి
ఆయన నాయకత్వంలో సాయుధ పోరాటం ఒక కొత్త దిశగా మలుపు తిరిగింది. గ్రామాల్లో పడి ఇళ్ళను కాల్చివేసి, స్త్రీలపై అత్యాచారాలకు పాల్పడుతున్న రజాకార్లను తమ దళంతో తరిమికొట్టి ప్రజల ప్రాణాల్ని స్త్రీల గౌరవాన్ని కాపాడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి చేనేత కార్మికులకు రేషన్ ఇప్పిస్తున్నారని, అప్పటి తాలుకాదార్ బాకూర్ హుస్సేన్.. అనభేరికి ఎన్నోసార్లు వారంట్స్ జారీ చేసిన ఆయన బెదరలేదు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్నఅనభేరి కార్యక్రమాల్ని అడ్డుకునేందుకు ఆయనకు తాలుక్దార్ పదవిని ప్రభుత్వం ఆశ చూపింది. కానీ తన ఆస్తిని, వతన్లను, హోదాను ప్రజలకోసం త్యాగం చేసిన అనభేరి ముందు నిజాం ప్రభుత్వం ఆయనకు ఎరగా చూపిన తాలుక్దార్ పదవి గడ్డి పోచ అయింది. అనభేరి లొంగకపోవడంతో ప్రభుత్వం ఆయన సభలను నిషేధించింది. ప్రభాకర్ రావుపై నజార్బంద్ జారీ చేయడంతో వారు అజ్ఞాతంలోకి పోవలసి వచ్చింది. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఎలా ఆపలేరో అలాగే అనభేరి కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేకపోయింది. భగ భగ మండే ప్రభాకరుడే అయ్యారు అనభేరి. (పెత్తందార్లు తమ ఆటలు సాగక అనభేరిని తమకు అడ్డు తొలగించడానికి, నిజాం ప్రభువుకు బంగారు కుర్చీ నజరానాగా ఇచ్చారని ఒక వదంతి కూడా ఉంది).

అన‌భేరిని ప‌ట్టిస్తే బ‌హుమానం..
నిజాంకు సింహ స్వప్నంలా మారిన అనభేరిని పట్టించిన వారికి 50 వేల రూపాయల బహుమానం ప్రకటించింది ప్రభుత్వం. కానీ పేద ప్రజలు సైతం ఆ డబ్బులకు లొంగలేదు. ఆయన ఎలా ఉంటారో తెలియక పోవడంతో నైజాం పోలీసులు నేనే అనభేరి అంటూ ముందుకు వచ్చిన వారిని కాల్చివేయసాగారు. తమ దేవుడిలా చూసుకొనే అనభేరిని రక్షించుకునేందుకు సామాన్య ప్రజలు డబ్బుల్ని, చివరికి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి ముందుకు వచ్చారు. 1948 మార్చి 14 న నిజాం ప్రభుత్వంతో కుమ్ముక్కైన మహ్మదాపూర్ పోలిస్ పటేల్ కుట్రతో అనభేరి దళాన్నిభోజనానికి పిలిచి రజాకార్లకు సమాచారం అందించాడు. ఒక్కసారిగా రజాకార్లు దాడి చేయడంతో అనభేరి ఊర్లో వారికి ప్రాణాపాయం ఉండకూడదని, తమ దళంతో గుట్టలవైపు పరుగెత్తారు. అనభేరికి తప్పించుకొనే అవకాశం ఉండి కూడా ఇప్పటికే తనకోసం ఎంతోమంది ప్రజలు ప్రాణత్యాగానికి సిద్దం అవుతున్నారని, భరించలేక రజాకార్లతో యుద్ధానికే సిద్ధం అయ్యారు.

షేర్ మ‌ర్ గ‌యా..
తన స్టెన్ గన్‌తో ఫైరింగ్ చేస్తూ ఎంతో మంది రజాకార్లని మట్టి కరిపించిన ఆయన తన స్నేహితుడు భూపతి రెడ్డి గాయపడడంతో ఆయనకు ఒక చేత్తో బ్యాండేజ్ చేస్తూ మరో చేత్తో ఫైరింగ్ చేయసాగారు. గాయపడ్డ అనభేరిని రజాకార్లు నీళ్లు ఇచ్చి హాస్పిటల్‌కు తీసుకుపోతం అన్న కూడా ఆయన వాళ్ళిచ్చిన నీరు తాగడానికి కానీ, హాస్పిటల్‌కు పోయి ప్రాణాలు కాపాడుకోవడానికి కానీ ఇష్టపడలేదు. చనిపోయిన ఆయన కోటును కట్టెకు చుట్టి “షేర్ మర్ గయా “ అంటూ రజాకార్లు అక్కడి ఊర్లన్నీ తిరుగుతూ నినాదాలు చేశారు. అనభేరి మరణంతో ఒక్కసారిగా తెలంగాణా అంతా భగ్గుమంది. ప్రతి ఊర్లోని యువకులు, స్త్రీలు దళాలుగా ఏర్పడి ఉద్యమించారు. ఫలితంగా ఆయన మరణించిన ఆరు నెలల్లోపే తెలంగాణా చెరవీడింది. తెలంగాణా ఉద్యమంలో తొలి సమిధగా మారి, తెలంగాణా విముక్తికి మూలం అయిన అనభేరికి, ప్రభుత్వం ఆయన త్యాగానికి సరైన గుర్తింపు నిస్తుందని, ఆయన స్ఫూర్తి దాయకమైన చరిత్రని పాత్యంశాల్లో చేర్చుతుందని, తెలంగాణకే తలమానికం అయిన తెలంగాణా షేర్/ భగత్ సింగ్ అయిన ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై నెలకొలుపుతుందని ఇప్ప‌టికీ ఓ ఆశ‌. ఎంతోమంది చేనేత కార్మికులు, కర్షకులకు జీవం పోసిన ఆయనకు సరైన స్థానం కల్పిస్తుందని, తెలంగాణా ప్రజలకోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తూ, తెలంగాణా ఆడపడచుల గౌరవాన్ని కాపాడిన అనభేరి జయంతి, వర్దంతిలను ప్రభుత్వ తరపున నిర్వహించేలా కార్యక్రమాల్ని చేపడుతుందని ఆశిద్దాం. మన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విన్నవిద్దాం.

- తాతయ్యకు అందరి తరఫున నివాళులర్పిస్తూ..
ఉమా సల్వాజి, న్యూజిలాండ్

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top