ఈయూ దేశాలకు వెళ్లేవారికి ముందస్తు అవగాహన.. త్వరలో అందుబాటులోకి..

Pre Departure Orientation Book Will Be Launched By International Labour Organization - Sakshi

ఇండియా నుంచి యూరప్‌కి విద్యా, ఉద్యోగం, వ్యాపార అవసరాల కోసం వెళ్లే వారికి ఉపయోగపడేలా ప్రీ డిపార్చర్‌ ఓరిమెంటేషన్‌ కలిగిన పుస్తకాన్ని అందుబాటులోకి తెస్తామని ఇండియా-ఈయూ ప్రాజెక్టు టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న అధికారి సీతా శర్మ తెలిపారు. ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌, ఢిల్లీ కార్యాలయంలో సీతా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె హైదరాబాద్‌లో పర్యటిస్తున్న సందర్భంగా కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ (కోట) చైర్మన్ ముళ్ళపూడి వెంకట అమ్రీత్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, ఇండియా ఉపాధ్యక్షులు కరకాల క్రిష్ణారెడ్డి, ప్రముఖ గాయని కౌసల్య, ఎమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు మంద భీంరెడ్డి, సౌత్ ఆఫ్రికా ఎన్నారై వెన్నపురెడ్డి లక్ష్మణ్ రెడ్డిలతో  సమావేశమయ్యారు. 

అందరితో మాట్లాడి
ఈ సందర్భంగా సీతా శర్మ మాట్లాడుతూ..  యూరోపియన్ యూనియన్ దేశాలకు వెళ్ళేవారికి ఉపయోగపడే ముందస్తు ప్రయాణ అవగాహన (ప్రి డిపార్చర్ ఓరియెంటేషన్) సమాచారం కలిగిన పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో పాటు అమెరికా తదితర దేశాల నుంచి సెలవుపై వచ్చి ప్రస్తుతం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న వివిధ సంఘాల ప్రతినిధులతో కూడా కలువనున్నట్లు ఆమె వివరించారు.

ఇండియా- ఈయూ ఒప్పందం
భారత దేశం నుండి యూరోపియన్ యూనియన్ (ఈయూ) దేశాలకు విద్య, ఉద్యోగం, వ్యాపారానికి  వెళ్ళేవారి కోసం అవగాహనతో పాటు తగిన సౌకర్యాలు కల్పించడానికి ఇండియా-ఈయూ కామన్ ఎజెండా ఆన్ మైగ్రేషన్ అండ్ మోబిలిటీ అనే ఒప్పందం జరిగింది. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండియా సెంటర్ ఫర్ మైగ్రేషన్ (ఐసీఎం), ఆస్ట్రేలియా కేంద్రంగా పందొమ్మిది దేశాలలో పనిచేసే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పాలసీ డెవలప్మెంట్ (ఐసీఎంపీడీ) 187 సభ్యదేశాలు కలిగిన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్ఓ) కలిసి  ఇండియా-ఈయూ  ప్రాజెక్టులో సహకార ఒప్పందం కుదుర్చుకొని కలిసి పనిచేస్తున్నాయి. 

సభ్య దేశాలు
యూరోపియన్ యూనియన్ - ఈయూ (షెంజెన్ కంట్రీస్)లో సభ్య దేశాలుగా ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, క్రొయేషియా, సైప్రస్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఇస్తోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, హంగేరి, ఐర్లాండ్, ఇటలీ, లాత్వియా, లిథువేనియా, లక్సెంబర్గ్, మాల్టా, నెదర్లాండ్స్, పోలాండ్, పోర్చుగల్, రోమానియా, స్లోవేకియా, స్లోవేనియా, స్పెయిన్, స్వీడన్ మొత్తం 27 దేశాలు ఉన్నాయి.

చదవండి: కనీస వేతనం, విదేశీ భవన్‌.. ఇంకా మరెన్నో..

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top