
మోర్తాడ్ (బాల్కొండ): ఖతర్‌కు వెళ్లాలనుకునే వలసకార్మికులకు క్వారంటైన్ చిక్కులు వచ్చిపడ్డాయి. అక్కడి హోటళ్లలో క్వారంటైన్‌కు అవసరమైన గది ఖాళీగా ఉంటేనే వీరి ప్రయాణానికి అనుమతి లభిస్తోంది. ఇతర గల్ఫ్‌దేశాలకంటే ఖతర్‌కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా అక్కడకు వెళ్లిన తరువాత ఏడు రోజులపాటు క్వారంటైన్ చేయడానికి అవసరమైన హోటల్ గదులు దొరకడం లేదు. ఫలితంగా ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ఖతర్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ దేశానికి వచ్చే విదేశీయులు ఎవరైనా వారంపాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్ ఉండాల్సిందే. కోవిడ్–19 సెకండ్ వేవ్ తరువాత పరిస్థితి కాస్త కుదుటపడటంతో గల్ఫ్ దేశాల్లో వివిధ కంపెనీల కార్యకలాపాలు గాడినపడుతున్నాయి.
2022లో ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడాటోర్నీకి ఖతర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఖతర్‌లో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఇతర గల్ఫ్‌దేశాల కంటే ఖతర్ నుంచే వీసాలు ఎక్కువగా జారీ అవుతున్నాయి. అయితే ఖతర్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లాలనుకునేవారు, కొత్తగా వెళ్లేవారు తప్పనిసరిగా వారంపాటు హోటల్ గదిలో క్వారంటైన్ ఉండాలి. శంషాబాద్ ఎయిర్‌పోర్టుతోపాటు మనదేశంలోని ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఖతర్‌కు షెడ్యూల్ విమానాలు నడుస్తున్నాయి. హోటల్ గదిని బుక్ చేసుకున్నట్లు రసీదు చూపితేనే విమానయాన సంస్థలు టికెట్ జారీ చేస్తున్నాయి. కానీ, ఖతర్‌లోని హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్‌లో ఉండాల్సివస్తోంది. ఒకవేళ ఖతర్ క్వారంటైన్ నిబంధన ఎత్తేస్తే సులభంగా ప్రయాణం చేసే అవకాశం ఏర్పడుతుంది.