పార్లమెంట్ లో ప్రవాస భారతీయం

External Minister V Muralidharan Told Indian Diaspora Details In Parliament - Sakshi

- 210 దేశాలలో 3,21,42,840 మంది ప్రవాసులు

- గల్ఫ్ దేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా 88,88,733

గుజరాత్ లోని రాజ్ కోట్ లోక్ సభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి మోహన్ భాయి కళ్యాణ్ జీ కుందరియా (బీజేపీ) విదేశాల్లో ప్రవాస భారతీయుల జనాభా గురించి అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ 2022 మార్చి 25న లోక్ సభలో లిఖితపూర్వక జవాబు ఇచ్చారు.  అందులో పేర్కొన్న వివరాల ప్రకారం నాన్‌ రెసిడెంట్‌ ఇండియన్‌, పర్సన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల జనాభా భారీగా ఉంది. మొత్తం 210 దేశాలలో 1,34,51,654 మంది ఎన్నారైలు (ప్రవాస భారతీయులు), 1,86,83,645 మంది పీఐవో (పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ - విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ సంతతి వారు) మొత్తం కలిపి 3,21,42,840 మంది ఓవర్సీస్ ఇండియన్స్ (భారత ప్రవాసీలు) ఉన్నట్టు తేలింది.  

గల్ఫ్‌ దేశాల్లో
మొత్తం ఆరు గల్ఫ్ దేశాలలో  కలిపి 88,88,733 మంది ఎన్నారైలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా యూఏఈలో 34,19,875, సౌదీలో 25,92,166, కువైట్‌లో 10,28,274, ఓమాన్‌లో 7,79,351, ఖతార్‌లో 7,45,775, బహరేన్‌లో 3,23,292 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. 

ఇసీఆర్‌ పాస్‌పోర్టుతో
ఇసిఆర్ పాస్ పోర్ట్ అంటే.. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్ (విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన). 10వ తరగతి కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారికి ఇలాంటి పాస్ పోర్టు జారీ చేస్తారు. అమాయకులైన కార్మికుల రక్షణ కొరకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఇసిఆర్ పాస్ పోర్ట్ కలిగినవారు 18 ఇసిఆర్ (ముఖ్యంగా ఆరు గల్ఫ్) దేశాలకు ఉద్యోగానికి వలస వెళ్లిన ఇ-మైగ్రేట్ గణాంకాలను పార్లమెంటుకు తెలియజేశారు. ఇందులో ఇసిఎన్ఆర్ పాస్ పోర్ట్ కలిగిన వారికి సంబంధించి కచ్చితమైన వివరాలు లేవు. అలాగే విజిట్ వీసా పై వెళ్లిన వారి వివరాలు కూడా లెక్కలోకి తీసుకోలేదు. 2019 లో 3,68,048 మంది, 2020లో 94,145 మంది,  2021లో 1,32,673 మంది వలస వెళ్లినట్లు తెలిపారు.  

ఇఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్ట్‌తో..  
ఇసిఎన్ఆర్ పాస్ పోర్ట్ అంటే.. ఎమిగ్రేషన్ క్లియరెన్స్ నాట్  రిక్వయిర్డ్ (విదేశాలకు ఉద్యోగానికి వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి అవసరం లేదు). 10వ తరగతి పాస్ అయిన వారికి లేదా విదేశాల్లో మూడేళ్ళ అనుభవం ఉన్నవారికి  లేదా ఆదాయపు పన్ను (ఐటి) చెల్లింపుదారులకు లేదా 50 సంవత్సరాల వయస్సు పైబడిన వారికి ఇలాంటి పాస్ పోర్ట్ జారీ చేస్తారు. అనగా వీరు తెలివైన వారు, ఏదైనా కష్టం వస్తే తమను తాము రక్షించుకోగలుగుతారని అర్థం.  

- మంద భీంరెడ్డి (+91 98494 22622 )
 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top