● ఇబ్బందిపడుతున్న వాహనదారులు
● పట్టించుకోని అధికారులు
బోధన్ : సాలూర మండలానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర వైపు వెళ్లే అంతర్రాష్ట్ర రోడ్డు అంచున ఇరువైపుల పలు చోట్ల ముళ్ల పొదలు పెరిగి రోడ్డుపైకి రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీదుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. ముళ్ల పొదల వల్ల రాత్రి వేళల్లో వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలున్నాయి. అంతర్రాష్ట్ర బైపాస్ రోడ్డు మార్గంలో ఇరువైపులా పంట పొలాలున్నాయి. ఆదమరిచి వాహనాలు డ్రైవింగ్ చేస్తే వాహనాలు పంట పొలాల్లోకి దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. సంబంధిత శాఖ అధికారులు ఈ రోడ్డు నిర్వహణ, పర్యవేక్షణ విషయంలో పట్టించుకోవడం లేదు.
పట్టణ శివారు నుంచి ప్రారంభమై సాలూర మండల కేంద్రం శివారులోని మంజీర నది వరకు విస్తరించి ఉన్న అంతర్రాష్ట్ర బీటీ రోడ్డు సుమారు 8.3 కిలో మీటర్ల పొడువున ఉంది. అంతర్రాష్ట్ర రవాణాకు కీలకమైన ఈ రోడ్డును మూడేళ్ల క్రితం విస్తరణ చేపట్టి పూర్తి చేశారు. ఇదే రోడ్డు మార్గంలో ఉన్న బోధన్ మండలం నాగన్‌పల్లి గ్రామ అంచున ఉన్న పసుపు వాగుపై హైలెవల్ వంతెన చేపట్టారు. 2025 జూన్ నెలకు ముందు నుంచే ఈ వంతెన మీదుగా అంతర్రాష్ట్ర రవాణా ప్రారంభమైంది. అంతర్రాష్ట్ర రోడ్డు విస్తరణలో భాగంగా బోధన్, సాలూర మండలంలోని నాగన్‌పల్లి, సాలూర క్యాంప్, సాలూర గ్రామాల శివారులో బైపాస్ రోడ్డును నిర్మించారు.
ఎన్‌హెచ్‌ఏ, పోలీస్ శాఖ సహకారంతో అంతర్రాష్ట్ర రోడ్డు మార్గంలో భద్రత చర్యలు చేపట్టారు. పలు చోట్ల ఫైబర్ స్పీడ్ బ్రేకర్స్‌తోపాటు ప్రమాద సూచీక బోర్డులు, పోలీస్ కటౌట్లు ఏర్పాటు చేసి వదిలేశారు. అలాగే పలు గ్రామాల క్రాసింగ్ వద్ద లైటింగ్ స్తంభాలను ఏర్పాటు చేసినా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. దీంతో ప్రధాన కూడళ్లల్లో అంధకారం నెలకొంది. కొంత కాలంలో ఈ రోడ్డుపై నిర్వహణకు అధికారుల పర్యవేక్షణ కొరవడింది. ఇకనైనా అధికారులు స్పందించి ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
అంతర్రాష్ట్ర రోడ్డు నిర్వహణ, పర్యవేక్షణను అధికారులు పట్టించుకోవాలి. రోడ్డు అంచున పెరిగిన ముళ్ల పొదల వల్ల వాహనదారుల ప్రాణాలకు ముప్పు ఉంది. మాగ్రామంతో పాటు పలు చోట్ల లైటింగ్ కోసం స్తంభాలు వేశారు. కానీ కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించాలి.
– శ్రీనివాస్ రెడ్డి,
సాలూర క్యాంప్ మాజీ ఎంపీటీసీ


