● యానంపల్లి వద్ద ఒకరి మృతి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): మండలంలోని యానంపల్లి గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు, డిచ్‌పల్లి ఎస్సై ఎండీ ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. యానంపల్లి గ్రామానికి చెందిన జయ్య నవీన్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి ఆదివారం బైక్‌పై డిచ్‌పల్లి వైపు బయలుదేరాడు. అదే సమయంలో మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన గుర్రపు కిషన్ (46) తన బైక్‌పై సుద్దులం నుంచి తన గ్రామానికి వెళుతున్నాడు. బాలికల గురుకుల పాఠశాల సమీపంలో రోడ్డుపై గుంతను తప్పించడానికి ముందు వెళుతున్న నవీన్ సడన్‌బ్రేక్ వేశాడు. ఈక్రమంలో వెనకే వస్తున్న కిషన్ బైక్ అతడిని ఢీకొనగా, రెండు బైక్‌లు కొంతదూరం రాసుకుపోయాయి. అదే సమయంలో రామడుగు గ్రామానికి చెందిన నీరడి ప్రదీప్ తన భార్య, కొడుకుతో కలిసి బైక్‌పై సుద్దపల్లి వైపు నుంచి తన గ్రామానికి వెళుతున్నాడు. దీంతో నవీన్ వాహనం తగిలి ప్రదీప్ వాహనం కూడా అదుపుతప్పి రోడ్డుపై పడిపోయా రు. ఈ ఘటనలో కిషన్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే నవీన్, ప్రదీప్‌తోపాటు వారి కుటుంబీకులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక కంకర క్రషర్ల నుంచి నిత్యం భారీ లోడుతో రాకపోకలు సాగిస్తున్న టిప్పర్ల వల్ల రోడ్డుపై పలు చోట్ల భారీ గుంతలు ఏర్పడుతున్నాయని, దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోతున్నారని గ్రామస్తులు ఆరోపించారు.


