వర్షాధార పంటలకు గడ్డుకాలం | - | Sakshi
Sakshi News home page

వర్షాధార పంటలకు గడ్డుకాలం

Jun 24 2026 1:35 AM | Updated on Jun 24 2026 1:35 AM

సరిపడా వర్షాలు లేక

ఆందోళనలో అన్నదాతలు

సోయాబీన్‌, మొక్కజొన్న విత్తుకోవడంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి

ఆర్మూర్‌: జిల్లాలో వర్షాధార పంటలకు గడ్డుకాలం వచ్చింది. వర్షాకాలం ప్రారంభమైనా ఇప్పటికీ సరిపడ వర్షాలు పడకపోవడంతో జిల్లా రైతాంగం సోయాబీన్‌ వేయాలా, మొక్కజొన్న వేయాలా అని తేల్చుకోలేక తీవ్ర అయోమయంలో పడింది. జిల్లాలో 98,500 వ్యవసాయ బోరు బావులు ఉన్నా యి. ఈ ఖరీఫ్‌లో జిల్లావ్యాప్తంగా 54,601 ఎకరాల్లో మొక్కజొన్న, 34,227 ఎకరాల్లో సోయాబీన్‌ సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ వానలు లేకపోవడంతో ఆ లెక్కలన్నీ తలకిందులయ్యే పరిస్థితి వచ్చింది.

సోయాకు వాన.. మక్కకు బోరు..

తక్కువ పెట్టుబడి, తక్కువ కూలీలతో లాభాలు వస్తాయని శ్రమ తగ్గించుకొనే కొందరు రైతులు సోయాబీన్‌వైపు మొగ్గు చూపుతున్నారు. మొక్కజొన్నతో పోలిస్తే సగం శ్రమతోనే సోయాలో సమానమైన దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. దీంతో పొలాలను దుక్కి చేసి, విత్తనాలు సిద్ధం చేసుకుని ఆకాశం వైపు చూస్తున్నారు. కానీ సోయా పూర్తిగా వర్షాధార పంట కావడంతో తొలకరి పడితేనే విత్తనం పడేది. అలాగే మే చివరి నుంచి జూలై 15 వరకు మొక్కజొన్న విత్తుకోవచ్చు. ఇది 120 రోజుల పంట. నీటి వసతి ఉన్న రైతులు ధైర్యంగా మొక్కజొన్న వేస్తున్నారు. బోర్లలో నీళ్లు ఉన్నవారు కొంతలో కొంత విత్తనం వేసినా, వర్షం లేకపోతే ఆ పంట కూడా నిలబడే పరిస్థితి లేదు.

జాడలేని వ్యవసాయాధికారులు..

ప్రతికూల వాతావరణంలో రైతులకు దిశానిర్దేశం చేయాల్సిన వ్యవసాయ శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తాము రైతుల వద్దకు వెళ్లలేకపోతున్నామని కొందరు సిబ్బంది వాపోతున్నారు.

గతంలో మొక్కజొన్నకు ప్రత్యామ్నాయంగా సోయాను ప్రోత్సహించిన అధికారులు, ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల్లో ఏ పంట వేయాలో చెప్పలేక చేతులెత్తేస్తున్నారు.

విత్తుకోవడానికి అయోమయం

ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితి వచ్చిందని రైతులకు తెలుసు కానీ.. చూస్తూచూస్తూ వ్యవసాయ భూమిలో పంటలు విత్తుకోకుండా ఉండలేము. వర్షాలపై నమ్మకం ఉంచి బోరు బావులతోనైనా పంట పండిస్తామనే నమ్మకంతో విత్తుకుంటున్నాము. కానీ పంట చేతికి రావాలంటే వర్షం పడాల్సిందే.

– పెద్దకాపు రాజు, రైతు, పెర్కిట్‌, ఆర్మూర్‌

మొక్కజొన్న విత్తాను..

ప్రతీ ఏడాదిలాగే సోయాబీన్‌ విత్తుకుందామని అనుకున్నాం. కానీ తొలకరి సకాలంలో రాకపోవడంతో బోరుబావిలో ఉన్న నీటితో మొక్కజొన్న విత్తాను. మొక్కజొన్నకు కూడా వర్షం కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలో తోచడం లేదు. భూగర్భ జలాలు సైతం ఆశించిన స్థాయిలో లేవు.

– నచ్చు గంగాధర్‌, రైతు, పెర్కిట్‌, ఆర్మూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement