డొంకేశ్వర్(ఆర్మూర్): మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సభ్యులను కూడా సాగు బాట పట్టించనున్నారు. ఇప్పటికే ఆయా రంగాల్లో దూసుకెళ్తున్న మహిళలను వ్యవసాయ రంగంలో నూ రాణించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా మునగ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టింది. జిల్లాలో ఈ ప్రాజెక్టును విజయవంతం చేసేందుకు అధికారులు ము మ్మరంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ వినూత్న పథకంలో లబ్ధి పొందేందుకు చిన్న, సన్నకారు రైతులై ఉండి, మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటే సరిపోతుంది. నిరుపేద రైతులకు పెట్టుబడి భారం లేకుండా చేసేందుకు మునగ తోటల సాగుకు అవసరమయ్యే ప్రతి పైసాను ప్రభుత్వమే భరించనుంది. ఉపాధిహామీ (వీబీజీ రామ్ జీ) పథకం నిధుల ద్వారా ఈ సాగు ఖర్చులను పూర్తిగా భరించనున్నారు. గుంతలు తీయడం, మొక్కల కొనుగోలు, ఎరువులు, నీటి పారుదల వంటి అన్ని పనులను ఈజీఎస్ కింద కేటాయించనున్నారు. గ్రా మీణాభివృద్ధి శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్వహించిన అవగాహన సదస్సులకు జిల్లాలో స్పందన లభిస్తోంది. మొదటి విడతగా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 64 మంది మహిళా సంఘాల సభ్యులు మునగ తోటల పెంపకానికి ఉత్సాహంగా ముందుకొచ్చారు. వీరి ద్వారా మొత్తం 84.17 ఎకరాల్లో త్వరలోనే మునగ సాగు ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన భూముల ఎంపిక, సాంకేతిక అనుమతుల ప్రక్రియను అధికారు లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. మహిళల జీవితాల్లో ఈ ప్రాజెక్టు సరికొత్త వెలుగులు నింపనుందని జిల్లా అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పోషకాల పంట.. ఎగుమతులతో సిరులు
అత్యధిక పోష విలువలు కలిగిన మునగ ఆకులు (మొరింగా), మునక్కాయలకు అంతర్జాతీయంగా మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కేవలం మునక్కాయలు అమ్మడమే కాకుండా... మునగ ఆకులను శాసీ్త్రయ పద్ధతితో ఎండబెట్టి, నాణ్యమైన ప్యాకింగ్ చేసి ఇతర ప్రాంతాలకు, విదేశాలకు సైతం ఎగుమతి చేసుకునేలా మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నా రు. ఈ వాల్యూ యాడెడ్ ఉత్పత్తుల ద్వారా ఎస్‌హెచ్‌జీ మహిళలు అద్భుతమైన లాభాలు సాధించి, ఆర్థిక స్వావలంబన సాధించే అవకాశం లభిస్తుంది.
మునగ సాగుకు ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహం (రూ.లలో)
ఏపీవో, ఏపీఎంలకు దరఖాస్తులు ఇవ్వొచ్చు
ఎస్‌హెచ్‌జీ మహిళలను వ్యవసాయంలో నూ భాగస్వాములను చేయడానికి మునగ తోట వ్యాపారాన్ని ప్రభుత్వం ముందుకు తెచ్చింది. ఆసక్తి కలిగిన వారు ఉపాధిహామీ జాబ్‌కార్డు, ఆధార్, పట్టా పాసు పుస్తకం, బ్యాంకు ఖాతాలను దరఖాస్తుకు జోడించి స్థానిక మండలాల్లో ఏపీవో, ఏపీఎం కార్యాలయాల్లో అందజేస్తే సరిపోతుంది. రూపాయి పెట్టుబడి లేకుండా మునగను సాగు చేసుకొని లాభాలు పొందవచ్చు. దీనిని ఎస్‌హెచ్‌జీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
– సాయన్న, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి
గ్రామీణాభివృద్ధి శాఖ సరికొత్త ప్రణాళిక
భూమి ఉంటే చాలు.. పెట్టుబడి భారం పూర్తిగా సర్కారుదే
ఇప్పటికే జిల్లాలో ముందుకొచ్చిన 64 మంది మహిళలు


