సిరికొండ: మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు. గ్రామానికి చెందిన దొమ్మాటి నితిన్ గౌడ్ (27) అనే యువకుడు కొన్ని రోజులుగా తమకు గ్రామంలో సొంత ఇల్లు లేదని, ఎంబీఏ చదువుకున్నప్పటికీ ఉద్యోగం లభించడం లేదని మానసికంగా బాధపడుతున్నాడు. ఈక్రమంలో సోమవారం ఉదయం లొంక ఆలయానికి వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరాడు. మార్గ మధ్యలో లొంకతండా దాటిన తర్వాత అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఎల్లమ్మ ఆలయంలో చోరీ
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో 44వ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. గర్భగుడి తాళాలు పగులగొట్టి అమ్మవారి మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించుకుపోయారు. హుండీని గడ్డపారతో పెకిలించి అందులోని డబ్బులను దోచుకెళ్లారు. హుండీని, పగుల గొట్టిన తాళాలను ఆమడ దూరంలో పడేశారు. ఈ విషయమై గౌడ సంఘం ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.


