విద్యుత్ షాక్‌తో రైతు మృతి
ఇందల్వాయి: మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామానికి చెందిన అన్నారం భూమయ్య(51) అనే రైతు పొలం వద్ద సోమవారం ఉదయం విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడు. ఎస్సై సుమలత తెలిపిన వివరాల ప్రకారం.. భూమయ్య తన ఇంటి పక్కనే ఉన్న తన వ్యవసాయ మోటార్‌ని ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్ తగిలి మృతి చెందాడన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మృతుడి తమ్ముడు మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
సదాశివనగర్(ఎల్లారెడ్డి): మండలంలోని మల్లుపేట్ గ్రామ స్టేజీ వద్ద 44వ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ పైకి ఎక్కి నిజామాబాద్ వైపు వస్తున్న మరో కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక కారులోని భార్యాభర్తలు, మరో కారులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పుష్పరాజ్ తెలిపారు.


