విజిలెన్స్ విచారణ
● బాల్కొండ నియోజకవర్గంలో
ఇష్టారాజ్యంగా చెక్‌డ్యాముల పనులు
● తీవ్రంగా నష్టపోయిన రైతులు
మోర్తాడ్(బాల్కొండ): రైతాంగానికి మేలు చేయాలనే సంకల్పంతో చేపట్టిన పెద్దవాగు, కప్పలవాగుల్లో 12 చోట్ల చెక్ డ్యాములు నిర్మించిన విషయం తెలిసిందే. ఐదు చెక్‌డ్యాముల నిర్మాణంలో నాణ్యతాప్రమాణాలు పాటించకపోవడంతో వరద తాకిడి ని అవి తట్టుకో లేకపోయాయి. కుంగి, కూలిపోయి కట్టలు తెగి పంట పొలాల్లోకి నీరు చేరింది. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను కాంట్రాక్టర్లు పా టించకపోవడంతో వరదల తాకిడికి చెక్‌డ్యాములు కొట్టుకుపో యి రైతులకు నష్టం కలిగింది. పనుల్లో అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టినా కొందరు ప్రభుత్వ పెద్దలు అడ్డుపడడంతో అటకెక్కిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పరిస్థితి ఇదీ..
● వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, జాన్కంపేట్ మధ్య 3 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్ డ్యాంను 4.1 మీటర్ల ఎత్తులో నిర్మించారు. వరద నీటి తాకిడిని అంచనా వేయకపోవడంతో మట్టికట్టలు కూలిపోయి పంట పొలాలను నీరు ముంచెత్తింది. ● రూ.9.38 కోట్లతో మోర్తాడ్ మండలం సుంకెట్ వద్ద చెక్‌డ్యాం పనులను వర్షాకాలంలోనూ కొన సాగించాలని చూశారు. రెండుమార్లు చెక్‌డ్యాం కొట్టుకుపోయి పంట పొలాలు నీట మునిగాయి. ఇసుక మేటలు వేయడంతో ఒక్కో రైతు ఎకరానికి రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.
● మోర్తాడ్ మండలం పాలెం, ధర్మోరా మధ్య పెద్దవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం మట్టి కట్ట కూలిపోయి పంటలు పూర్తిగా నీట మునిగాయి. నాణ్యతా ప్రమాణాలను పా టించకపోవడంతో మూడుసార్లు కాజ్‌వే కుంగిపో యి, కూలిపోయి రాకపోకలకు అంతరాయం కలిగింది.
● ఏర్గట్ల మండలం తొర్తి, మోర్తాడ్ మండలం శెట్‌పల్లి మధ్య పెద్దవాగులో 2.5 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన చెక్‌డ్యాం ఎత్తును 4 మీటర్లకు పెంచారు. చెక్‌డ్యాం ఎత్తు పెరగడంతో నీటి నిలువ సామర్థ్యం ఎక్కువై పొలాల్లోకి నీరు చేరి పంటలు నీట మునిగాయి. దీంతో ఎలాంటి అనుమతులు లేకుండానే కట్ట ఎత్తును కుదించారు.
● భీమ్‌గల్ మండలం బెజ్జోరా వద్ద కప్పలవాగుపై నిర్మించిన చెక్‌డ్యాం ఎత్తు అధికంగా ఉండటంతో పంట పొలాల్లోకి నీరు చేరి రైతులు పంటలు సాగు చేసుకోలేని దుస్థితిలో ఉండిపోయారు.
రికార్డులు సేకరించారు..
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చెక్‌డ్యాముల నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విభాగానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి చెక్‌డ్యాంల నిర్మాణంలో చోటు చేసుకున్న లోపాలపై విన్నవించారు. స్పందించిన విజిలెన్స్ అధికారులు నీటి పారుదల శాఖ నుంచి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అధికారుల బృందం చెక్‌డ్యాంలను పరిశీలించి వెళ్లింది. ఇప్పటి వరకు తుది నివేదికను మా త్రం అందించకపోవడం గమనార్హం.


