నిజామాబాద్ అర్బన్/సుభాష్‌నగర్: భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ఆధ్యాత్మిక సంపదల్లో యోగా ఒకటని నిజామాబాద్ అర్బన్ ఎమ్మె ల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. యోగా ఆరోగ్య ప్రయోజనాలు అందించడమే కాకుండా మనిషి వ్యక్తిత్వం, ఆలో చన విధానం, సమాజం, ప్రకృతి మధ్య ఉన్న అను బంధాన్ని కూడా బలపరుస్తుందన్నారు. ఆధునిక కాలంలో చాలామంది యోగా అంటే కేవలం ఆసనాలు వేయడం, బరువు తగ్గడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని భావిస్తున్నారన్నారు. కానీ మనిషి శరీరం, మనసు, ఆత్మ మధ్య సమన్వయా న్ని సాధించడమే యోగా అసలు లక్ష్యమని పేర్కొ న్నారు. మనిషి సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించినప్పటికీ మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడని, ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయన్నా రు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగాను విశ్వవ్యాప్తం చేశారని, ఐక్యరాజ్యసమితి వేదికపై 2014 సెప్టెంబర్ 27న యోగాను అంతర్జాతీయ దినోత్సవం గా ప్రకటించాలని ప్రతిపాదించారని ఎమ్మెల్యే గుర్తుచేశారు. డిసెంబర్ 11న 177 దేశాల మద్దతుతో జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు. అనంతరం ఆయా శాఖల అధికారులు, సిబ్బంది, విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. విద్యార్థుల యోగా విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయుష్ ఆఫీసర్ గంగాదాస్, మేరా యువ భారత్ సమన్వయకర్త రమేశ్, డీవైఎస్‌వో పవన్‌కుమార్, యోగా గురువులు ప్రభాకర్, సిద్ధి రాములు, రాంచందర్, ఆయుష్ డీపీఎం వందన, తోట రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
ప్రపంచానికి అందిన ఆధ్యాత్మిక సంపద
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ
ఘనంగా అంతర్జాతీయ
యోగా దినోత్సవం


