ఎల్‌నినో..
డొంకేశ్వర్(ఆర్మూర్): వాతావరణ నిపుణులు చెప్పినట్లుగానే ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నైరుతి రుతుపవనాలు వచ్చినట్లే వచ్చి ముఖం చాటేశాయి. జూన్ నెల ముగుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవగా, జిల్లా వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలతో ఎండలు మళ్లీ ముదురుతున్నాయి.
దీంతో ఈ ఏడాది వానాకాలం (ఖరీఫ్ సీజన్ ) ఆరంభంలోనే అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పంటలు ఏమవుతాయోనని పసుపు, సోయా, మక్క విత్తనాలు విత్తిన రైతుల్లో ఆందోళన నెలకొంది. మబ్బుల రాక కోసం ఆకాశం వైపు ఎదురుచూస్తున్నారు. వరుణదేవా కరుణించవా అంటూ వేడుకుంటున్నారు. విత్తనాలు మొలకెత్తడానికి నీళ్ల కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా బోర్లపైనే ఆధారపడి పంటలకు, వరి నాడుమడులకు రోజూ నీరందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు పొలాల్లోనే రాత్రింబగళ్లు శ్రమిస్తున్నారు.
వాడుతున్న పంటలు..
జిల్లాలో సాధారణంగా ఖరీఫ్ సీజన్‌లో లక్షలాది ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఏడాది 5.30 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే, వర్షాలు లేకపోవడంతో సముచిత నీటి వనరులు లేని ప్రాంతాల్లో పోసిన వరి నారుమడులు ఎండుతున్నాయి. అప్పుడే మొలకెత్తిన సోయా, మక్క పంటలు వాడుతున్నాయి. ఇటు ప్రాజెక్టుల్లో కూడా నీటి నిల్వలు క్రమంగా తగ్గిపోవడంతో ఆయకట్టు రైతుల్లో పంటల సాగుపై భయం పట్టుకుంది. పంటలు వేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. వ్యవసాయ బోర్ల వాడకం పెరగడంతో భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. రైతులు కొత్త బోర్లు వేస్తున్నారు. ఇప్పటికే 60 శాతం మంది రైతులు వరినారు పోయగా, 7190 ఎకరాల్లో నాట్లు వేశారు. 8,728 ఎకరాల్లో మొక్కజొన్న, 1,229 ఎకరాల్లో సోయాను విత్తారు. సోయా విత్తనాలు ఎండవేడికి కుళ్లిపోయి మొలకెత్తడం లేదు.
తొండాకూర్ శివారులో బోరుతో మక్కకు నీరు పారిస్తున్న రైతు
ముఖం చాటేసిన నైరుతి రుతుపవనాలు
గరిష్ట ఉష్ణోగ్రతలతో భూమిలోనే
ఉడికిపోతున్న విత్తనాలు
నిలిచిపోయిన వ్యవసాయ పనులు
వర్షం కోసం ఆకాశం వైపు
రైతన్నల ఎదురు చూపులు


