● జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి
నిజామాబాద్ లీగల్: లోక్ అదాలత్ ద్వార పరిష్కారమైన కేసుకు చట్టబద్ధత వస్తుందని, సమయం, డబ్బులు మిగులుతాయని, సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగాల్సిన అగత్యం తప్పుతుందని, పెండింగ్ కేసులో ఇద్దరికీ విజయం చేకూరుతుందని జిల్లా జడ్జి జీవీఎన్ భారతలక్ష్మి అన్నారు. జిల్లా న్యాయసేవ సంస్థలో శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌ను ఆమె అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, ఇతర జడ్జీలతో కలిసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. జడ్జి మాట్లాడుతూ ఈ సంవత్సరం లోక్ అదాలత్ ద్వార ఐపీసీ సెక్షన్ 324, 338 కేసులను సైతం పరిష్కరించేందుకు కషిచేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు జిల్లా జడ్జి రూ. కోటి పదిలక్షల పరిహారం చెక్కును అందజేశారు. లోక్ అదాలత్‌లో మొదటి జిల్లా జడ్జి హరీష, రెండవ జిల్లా జడ్జి సుగాలి నారాయణ, నాల్గవ జిల్లా జడ్జి దరావత్ దుర్గాప్రసాద్, మొబైల్ కోర్టు జడ్జి చైతన్య అంగారి, జూనియర్ సివిల్ జడ్జి ఎం కీర్తిరాజ్, ఎకై ్సజ్ కోర్టు జడ్జి వడ్డి హరికుమార్ పాల్గొన్నారు.
రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారం
జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఏడో స్థానంలో నిలిచింది. లోక్ అదాలత్‌లో జిల్లాలో మొత్తం 28,686 కేసులను పరిష్కరించారు. ఇందులో 68 సివిల్ కేసులు, 7025 క్రిమినల్ కేసులు, 21,593 ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే ఉన్న పెండింగ్ కేసుల్లో 68 సివిల్ కేసులు, 7025 క్రిమినల్ కేసులు, మొత్తం 7093 పెండింగ్ కేసులకు ఈ లోక్ అదాలత్ ద్వార శాశ్వత పరిష్కారం చూపా రు. 41 మోటారు వాహన ప్రమాదాల కేసు ల్లో కక్షిదారులకు రూ. 4 కోట్ల 79 లక్షలు, 162 బ్యాంక్ ప్రీలిటిగేషన్ కేసుల్లో ఒక్క కోటి 25 లక్షల 22,070 పరిహారం అందజేశారు.


