● టూటా అధ్యక్ష, కార్యదర్శులు పున్నయ్య, మోహన్‌బాబు
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీలో 2012 ఏడాది నోటిఫికేషన్ ద్వారా 2014లో భర్తీ అయిన అధ్యాపకుల నియామకాలపై తప్పుడు ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(టూటా) ఖండించింది. శనివారం యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టూటా అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పున్నయ్య, మోహన్‌బాబు మాట్లాడుతూ న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని తప్పుగా చిత్రీకరించేలా కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. 2013లో వేసిన రిట్ పిటిషన్ నెంబరు 5566 కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు (తేదీ 31.10.2025)లపై ఇప్పటికే హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు రిట్ అప్పీళ్లు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. సింగిల్ జడ్జి ఉత్తర్వు పై డివిజన్ బెంచ్ ఇంటీరిమ్ సస్పెన్షన్ మంజూరు చేసిందన్నారు. దీంతో సింగిల్ జడ్జి ఉత్తర్వును అమలులో ఉన్న తుది తీర్పుగా చూపిస్తూ, అధ్యాపకులను ‘అక్రమ నియామకులు’గా ముద్ర వేయడం చట్టపరంగా తప్పు అని పేర్కొన్నారు. 2014లో నియామకమైన అధ్యాపకులకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం న వంబర్ 2024లో లేఖ ద్వారా తెలిపిందని టూటా అధ్యక్ష, కార్య దర్శులు తెలిపారు. పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని అడ్వకేట్ జనరల్ తన లీగల్ ఒపీనియన్‌లో పేర్కొన్నారని, 2025 జనవరి 4న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశంలో పదో న్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానించిందని గుర్తుచేశారు. పదోన్నతుల ప్రక్రియ కొనసాగిస్తుండగానే, హైకోర్టు సింగి ల్ బెంచ్ 2012లో ఇచ్చిన 1, 2వ నోటిఫికేషన్లను రద్దు చేయాలని తీర్పునిచ్చిందని, దీంతో తమ పదోన్నతుల ప్రక్రియ అర్ధంతరంగా నిలిచిపోయిందన్నారు. అధ్యాపకులు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని స్పష్టం చేశారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలను వక్రీకరించి అసత్య ఆరోపణలు చేస్తే సంబంధితులపై డిఫమేషన్, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అసోసియేషన్ వెనుకాడదని హెచ్చరించారు. టూటా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శులు బాలకిషన్, నీలిమా, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జమీల్, ప్రసన్న రా ణి, విద్యావర్ధిని, వాసం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


