క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Jun 21 2026 7:58 AM | Updated on Jun 21 2026 7:58 AM

వృద్ధుడి ఆత్మహత్య గుర్జాల్‌లో మరో వృద్ధుడు.. నిజామాబాద్‌లో మహిళ.. బాలుడిపై పిచ్చికుక్కల దాడి

జక్రాన్‌పల్లి: నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామ శి వారు ప్రొద్దుటూరి సదానందం వృద్ధాశ్రమం వెనకాల ఓ వృద్ధుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై మహేశ్‌ తెలిపారు. నిర్మల్‌ జిల్లా సారంగపూర్‌ మండలం కంకట గ్రామానికి చెందిన నడ్కుల పెద్ద లస్మన్న (68) భార్య, కుమారుడు, కూతురు గతంలో వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో లస్మన్న ఒంటరిగా ఉంటూ బాధపడేవాడు. ఈ నెల 19న కంకట నుంచి బయల్దేరి అంకాపూర్‌లో బస్సు దిగాడు. వృద్ధాశ్రమం వెనుకకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి బావమరిది కుంటోల్ల లస్మన్న ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

గాంధారి(ఎల్లారెడ్డి): మండల పరిధిలోని గుర్జాల్‌ గ్రామానికి చెందిన మంగళారం పోచయ్య (60) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మహేందర్‌ శనివారం తెలిపారు. పోచయ్య ఈ నెల 16న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 19న కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులకు శనివారం బ్రాహ్మణ్‌పల్లి శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఒకరు ఉరేసుకొని మృతి చెందినట్లు సమాచారం వచ్చింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడిని పోచయ్యగా గుర్తించారు. మృతుడి కుమారుడు సతీశ్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్‌ తెలిపారు.

నిజామాబాద్‌ అర్బన్‌: నగరంలోని శివాజీనగర్‌కు చెందిన లక్ష్మి(45) ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై యాదగిరిగౌడ్‌ తెలిపారు. తనకు క్యాన్సర్‌ సోకడంతో వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చయ్యాయని, అయినా కూడా క్యాన్సర్‌ తగ్గదనే ఆవేదనతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిందన్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

దోమకొండ: మండలంలోని అంచనూరు గ్రామంలో శనివారం ఓ బాలుడిపై పిచ్చికుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన బైకరి రుత్విక్‌పై కుక్కలు దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే కుక్కలను తరిమివేసి బాలుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ తరలించినట్లు తండ్రి బైకరి మహేశ్‌ తెలిపారు. రుత్విక్‌తోపాటు గ్రామానికి చెందిన మరో ఇద్దరిపై కుక్కలు దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement