కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్ అర్బన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో నిర్వహించిన వివిధ కార్యక్రమాల వివరాలను పొందుపరుస్తూ శాఖల వారీగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో శనివారం అన్ని శాఖల అధికారులు, ఆయా మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.
ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల నిర్వహణ తీరును పర్యవేక్షించి, తగిన దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్లను నియమించిందన్నారు. నిజామాబాద్ జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా నియమితులైన రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి, డాక్టర్ యోగితారాణా త్వరలోనే జిల్లాకు వచ్చి ప్రగతి ప్రణాళిక కార్యక్రమాల అమలును సమీక్షిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో, వార్డులు, మున్సిపల్ పట్టణాల వారీగా నిర్వహించిన గ్రామసభలు, ఇతర కార్యక్రమాల వివరాలను తెలియజేస్తూ సోమవా రం సాయంత్రం లోపు సమగ్ర నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలు, వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ఆయా వర్గాల వారికి చేకూర్చిన లబ్ధిని నివేదికల్లో పొందుపరచాలని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, జెడ్పీ సీఈవో సాయాగౌడ్, డీఆర్‌డీవో సాయన్న, డీఈవో అశోక్, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.


