మోపాల్: పిట్ట కొంచెం.. కూత ఘనం అన్న చందంగా యోగాసనాల్లో మోపాల్ మండల కేంద్రానికి చెందిన అక్షర ఆరితేరింది. తొమ్మిదేళ్ల వయస్సులోనే కఠినమైన ఆసనాలను అలవోకగా చేస్తూ అబ్బురపరుస్తోంది. తండ్రి అంగలి నవీన్‌రెడ్డి ప్రోత్సాహంతో మొదట ఇంటి దగ్గర యోగాసనాలను ప్రారంభించింది. చిన్నారికి మరో ఇద్దరు పిల్లలు తోడయ్యారు. యోగా ప్రాధాన్యతను గుర్తించిన గ్రామస్తులు యోగాసనాలు చేసేందుకు ఆసక్తిచూపారు. ఐదుగురితో మొదలైన యోగా టీం.. నేడు ఆ సంఖ్య 60కి పైగా చేరింది. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి 7 గంటల వరకు జిల్లా పరిషత్ పాఠశాలలో శిబిరం కొనసాగుతోంది. శీర్షాసనం, హ లాసనం, భుజంగాసనం, చక్రాసనం, బద్ద పద్మాసనం, పూర్ణ ధనురాసనం వంటి కఠినమైన ఆసనాలు అలవోకగా చేస్తుంది. పద్మాసనం, పచ్చిమొత్తాసనం, వజ్రాసనం, మయూరాసనం, నౌకాసనం, అర్ధ చక్రాసనం, త్రికోణాసనం, వక్రాసనం, భద్రాసనం, వంటి అనేక ఆసనాలు ప్రదర్శిస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటుంది.


