● మహిళా సంఘ స్థలం కబ్జాపై ఆందోళన
నందిపేట్(ఆర్మూర్): మహిళా సంఘానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నందిపేట మండల కేంద్రంలో శుక్రవారం మహిళా సంఘ సభ్యులు ధర్నా చేపట్టారు. స్థానిక బస్టాండ్ ఎదుట బైఠాయించారు. మండల కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం పక్కన ఉన్న మహిళ సంఘం స్థలంలో ఓ ఆలయానికి సంబంధించిన వారు పిల్లర్లను వేయడాన్ని వ్యతిరేకించారు. ధర్నా నిర్వహించిన అనంతరం గ్రామ పంచాయతీకి ర్యాలీగా వెళ్లి సర్పంచ్ ఎర్రం లింగం, పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు. అనంతరం మహిళా సంఘం ఆవరణలో కట్టిన పిల్లర్లను కూలదోశారు. మండల కేంద్రంలోని ఏడు సంఘాలలోని 3 వేల మంది మహిళలకు ఈ భవనం ఒక్కటే దిక్కుఅని మహిళా సమాఖ్య సంఘం అధ్యక్షురాలు ఎర్రం పద్మ అన్నారు. గ్రామంలో ఉన్న ఒకే ఒక్క భవనాన్ని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


