మోర్తాడ్(బాల్కొండ): అంగన్‌వాడీ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నా వాటి భర్తీ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదు. ఆయా పోస్టులతోపాటు టీచర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారోనని ఎంతో మంది నిరీక్షిస్తున్నారు. జిల్లాలో 1501 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, ఇందులో 135 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను అప్‌గ్రేడ్ చేశారు. అప్‌గ్రేడ్ అయిన సెంటర్లలో ఆయా పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. అంగన్‌వాడీ ఆయాలు, టీచర్లకు పదవీవిరమణ నిబంధనలు అమలులోకి రావడంతో ఎంతో మంది ఇంటికి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో 400 ఆయా పోస్టులు, 76 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2018 తరువాత పోస్టుల భర్తీ లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే ఖాళీలను భర్తీ చేసేవారు. అయితే నియామకాల్లో పారదర్శకత లోపించిందనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఎమ్మెల్యేలు తమ అనుకూలురను నియమించుకోవడంతో అర్హులకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. దీంతో నియామకాల ప్రక్రియను కలెక్టర్‌లకు అప్పగించింది. బాధ్యతలు కలెక్టర్‌ల చేతుల్లోకి వెళ్లిన తరువాత ఒక్కసారి మాత్రమే ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసి ఆ తరువాత పోస్టుల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంగన్‌వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఇంగ్లిష్ మాధ్యమంలో చిన్నారులకు బోధన అందించాలని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు ఎంతో ప్రాధాన్యత లభించనుంది. ప్రభుత్వ ఆశయం బాగానే ఉన్నా ఖాళీలను భర్తీ చేయకుండా ఎలాంటి విద్యా సేవలు అందించలేరని పలువురు పేర్కొంటున్నారు.
అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. ఏళ్ల తరబడి పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల పని చేస్తున్న వారిపై భారం పెరిగింది. ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్, ఆయాల పోస్టులను భర్తీ చేసి అంగన్‌వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలి.
– దేవగంగు, అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు
అంగన్‌వాడీ సెంటర్లలో 400 ఆయా, 76 టీచర్ పోస్టులు ఖాళీ
2018 తరువాత మళ్లీ
రిక్రూట్‌మెంట్ లేదు
మినీ అంగన్‌వాడీలను అప్‌గ్రేడ్ చేసినా ఆయాలను నియమించని వైనం


