పగలు రెక్కీ.. రాత్రి చోరీ | - | Sakshi
Sakshi News home page

పగలు రెక్కీ.. రాత్రి చోరీ

Jun 19 2026 1:30 AM | Updated on Jun 19 2026 1:30 AM

జిల్లాలో పెరుగుతున్న దొంగతనాలు

జాతీయ రహదారి మీదుగా

మహారాష్ట్రకు పరారీ

మరింత నిఘా పెంచితేనే మేలు

నిజామాబాద్‌ అర్బన్‌ : జిల్లాలో మళ్లీ దొంగతనాలు పెరిగాయి. కొన్ని రోజులుగా దొంగతనాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా సోమవారం జిల్లా కేంద్రంలో మూడు ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. పోలీసుల నిఘా, పెట్రోలింగ్‌ వ్యవస్థ మరింత పెంచితేనే దొంగతనాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

– ఇటీవల నగరంలోని సుభాష్‌నగర్‌లో రిటైర్డ్‌ జాయింట్‌ కలెక్టర్‌ రవికుమార్‌ ఇంటిలో తాళం పగులగొట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. 20 తులాల బంగారం ఉన్న లాకర్‌ను ఎత్తుకెళ్లారు. గాయత్రినగర్‌, పద్మనగర్‌ కాలనీలతోపాటు సుభాష్‌నగర్‌ ఏరియాల్లో చైన్‌స్నాచింగ్‌ కేసులు నమోదయ్యాయి. పద్మనగర్‌లో వరుసగా మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది.

– ఆర్మూర్‌లో వరుసగా మూడు ఇళ్లలో, వర్ని మండలం శ్రీనగర్‌లో వరుసగా నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. తాళాలు పగులగొట్టి 4 తులాల బంగారం, రూ. 20 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇటీవల నగరంలోని వర్నిరోడ్డు, ఆర్యనగర్‌ ప్రాంతాల్లో ఏటీఎంలను కొల్లగొట్టి రూ.35 లక్షలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే ఖలీల్‌వాడిలో పంజాబ్‌నేషనల్‌ బ్యాంక్‌ ఏటీఎం దొంగతనానికి యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. సుభాష్‌నగర్‌లోని అపార్ట్‌మెంట్‌లో తాళం పగులగొట్టి దొంగతనం చేశారు. ఇలా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలు పగటిపూట రెక్కి నిర్వహించి రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రివేళల్లో చోరి చేస్తున్నారు. దొంగలు పగటి పూట వీధుల్లో వివిధ రకాల వస్తువులు విక్రయిస్తూ తాళం లేని ఇళ్లను గుర్తిస్తున్నారు. రాత్రివేళ దొంగతనాలకు పాల్పడుతూ జాతీయ రహదారి మీదుగా మహారాష్ట్ర వైపు తేలికగా తప్పించుకొని పారిపోతున్నారు.

దొంగలకు తాళం వేసిన ఇళ్లే టార్గెట్‌గా మారుతున్నాయి. పగటి పూట వీధుల్లో చిన్నచిన్న వస్తువులు విక్రయిస్తూ తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తున్నారు. తర్వాత రెక్కీ నిర్వహించి ఇంట్లోని సభ్యులు ఊరికి వెళ్లారని నిర్ధారించుకుని రాత్రి వేళ చోరీలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఒకే రోజు వరుసగా రెండుమూడు ఇళ్లల్లో చోరీలు జరిగాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement