● తెయూ రిజిస్ట్రార్ యాదగిరి
ఖలీల్‌వాడి: విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందకెళ్లితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెయూ రిజిస్ట్రార్ యాదగిరి తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కాకతీయ మహిళా ఇంజినీరింగ్ కాలేజ్ విద్యార్థులకు పట్టాలను అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యతో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, సాఫ్ట్‌వేర్ రంగమే కాకుండా పోటీ పరీక్షల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చునని తెలిపారు. అనంతరం కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ చెరుకూరి రజినీకాంత్ మాట్లాడుతూ కాకతీయ మహిళ ఇంజినీరింగ్ కాలేజ్‌కు చెందిన 232 విద్యార్థినులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించడంతో వారిని అభినందించారు. విద్యార్థినులు తల్లిదండ్రులు, సమాజానికి గర్వకారణంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ సెల్వకుమార్, మేనేజర్ నాగేశ్వర్‌రావు, వైస్‌ప్రిన్సిపల్ సాయారెడ్డి, సిబ్బంది తదితరులు ఉన్నారు.
కామారెడ్డి టౌన్: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఇందుప్రియలు గురువారం టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కమిటీ ముందు హాజరై కమిటీ చైర్మన్ మల్లు రవికి తన వివరణ ఇచ్చారు. పక్షం రోజుల క్రితం కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీస్‌కు సమాధానమిస్తూ నివేదికలను చైర్మన్‌కు స్వయంగా అందజేశారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, చంద్రశేఖర్‌రెడ్డి మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదులు చేసుకున్నారు.
రుద్రూర్: రుద్రూర్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్సైగా మనోజ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. బోధన్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తు న్న ఆయన బదిలీపై రుద్రూర్ వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
నిజామాబాద్ రూరల్: మండలంలోని ముత్తకుంట గ్రామంలో ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుల ఇళ్లను గురువారం హౌసింగ్ పీడీ గీత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడుతుందన్నారు. అర్హులను గుర్తించడంతో అధికారులు అలసత్వం వహించరాదని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంనారాయణ రెడ్డి, గ్రామ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు.


