● రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ
చైర్మన్ అన్వేష్‌రెడ్డి ఆరోపణ
మోర్తాడ్(బాల్కొండ): బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన ప్రశాంత్‌రెడ్డి ఎన్నో సమస్యలపై రైతులు రోడ్డు ఎక్కాలని ప్రయత్నిస్తే పో లీసులపై ఒత్తిడి తీసుకువచ్చి నిర్బంధించారని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకెట్ అన్వేష్‌రెడ్డి ఆరోపించారు. రైతుల విషయంలో మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ద్వంద్వ నీతి పాటిస్తున్నారని స్పష్టం చేశారు. బుధవారం ఆయన హైదరాబాద్ నుంచి శ్రీసాక్షిశ్రీతో ఫోన్‌లో మాట్లాడారు. రైతులు తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని నిలదీయడంలో తప్పు లేదన్నారు.పసుపు, ఎర్రజొన్నల ధరలు, ఎస్సారెస్పీ లీకేజీ నీటి గురించి ప్రశ్నించిన రైతులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించిన ప్రశాంత్‌రెడ్డి ఇప్పుడు అధికారం కోల్పోగానే మొసలి కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. యూరియా కోటాను కేంద్రం తగ్గించినా జిల్లాలో మాత్రం ఎలాంటి కొరత లేకుండా తాము చర్యలు తీసుకున్నామని వివరించారు. యూరియా సమస్య లేకున్నా రైతులను బీఆర్‌ఎస్ నాయకులు పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రైతులు ప్రతిపక్ష పార్టీల ఉచ్చులో చిక్కుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
సుభాష్‌నగర్ : వర్షాకాలంలో ఈదురుగాలులు, భారీ వర్షాలతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అడ్వాన్స్‌డ్ యాక్షన్ ప్లాన్‌ను చేపట్టామని ఎన్‌పీడీసీఎల్ నిజామాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ పీవీ రాజేశ్వర్ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక టెక్నాలజీ సాయంతో విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడమే ఉద్దేశమని పేర్కొన్నారు. హైపర్ సిక్స్ –స్టెప్ ఫార్ములా విద్యుత్ అంతరాయాలను అధిగమించడానికి సంస్థ ఆరు అంచెల వ్యూహాత్మక క్రమాన్ని రూపొందించిందన్నారు. కంట్రోల్ రూమ్ అలర్ట్, కావాల్సిన అదనపు సిబ్బంది, అవసరమైన లైన్ మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచడం, కచ్చితమైన సమాచారాన్ని వేగంగా సేకరించి, సంబంధిత టీమ్‌లకు చేరవేయడం, పటిష్ట వ్యూహం, యుద్ధప్రాతిపదికన పనులు, ఫైనల్ రీస్టోరేషన్ విధానాలను అవలంబిస్తున్నట్లు తెలిపారు.
రుద్రూర్ : సీసీ కెమెరాల ఏర్పాటుతో ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని, నేరాలను నియంత్రించొచ్చని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. మండలంలోని రాయకూర్ క్యాంపులో ఏర్పాటు చేసిన 10 సీసీ కెమెరాలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ గ్రామాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా పోలీసు శాఖకు దర్యాప్తులో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.


