ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలకే పంపుతాం

Jun 18 2026 1:29 AM | Updated on Jun 18 2026 1:29 AM

ధర్మోరలో ఒకే రోజు 50 మంది చేరిక

సర్పంచ్‌ కూతురు సైతం..

భీమ్‌గల్‌లో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కూతురు..

మాక్లూర్‌ : మాక్లూర్‌ మండలం ధర్మోర గ్రామస్తులు తీసుకున్న నిర్ణయం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాటలో భాగంగా సర్పంచ్‌ పందిరి శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ రాజుల నాగేష్‌, పాలకవర్గం కల్పించిన అవగాహనతో గ్రామస్తులు ముందడుగు వేశారు. 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఇక్కడి ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించారు. తొలుత సర్పంచ్‌ శ్రీనివాస్‌ ప్రయివేటు పాఠశాలలో 3వ తరగతి చదివే తన కుమార్తె శ్రీహితను ప్రభుత్వ బడిలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. దీంతో గ్రామంలోని సుమారు 50 మంది పిల్లలను బుధవారం ఎంఈవో సత్యనారాయణ సమక్షంలో తల్లిదండ్రులంతా కలిసి చేర్పించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ మాట్లాడుతూ ధర్మోర గ్రామాన్ని, పాలకవర్గాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అన్ని గ్రామాలు ముందుకు రావాలని కోరారు. కూతురిని చేర్పించిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ను అభినందించారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి పాఠశాల విద్యార్థులకు అవసరమయ్యే బెంచీలు, విద్యా వలంటీర్లు, ఇతర వాటి కోసం సహకారం అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాఠశాలకు రూ.25,000 అందజేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శంకర్‌, ఉపాధ్యాయుడు కపిల్‌ దేవ్‌, వలంటీర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ కూతురు..

కమ్మర్‌పల్లి(భీమ్‌గల్‌): భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బొదిరే నాగమణి, స్వామి దంపతులు తమ కూతురు బొదిరే శ్రీహితను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ 6వ తరగతి ఇంగ్లిష్‌ మీడియంలో చేర్పించారు. ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందని భావించి చేర్పించామని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి బంగారు భవిష్యత్‌కు బాటలు వేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement