సుభాష్‌నగర్: టీబీ నియంత్రణే అందరి లక్ష్యమని డీఎంహెచ్‌వో రాజశ్రీ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని కార్యాలయంలో బుధవారం టీబీ కార్యక్రమాల పురోగతిపై సంబంధిత సిబ్బందితో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ టీబీ రోగులకు ప్రభుత్వం అందించే నిక్షయ్ పోషణ యోజన నగదు ప్రోత్సాహకాలు సకాలంలో బ్యాంకు ఖాతాల్లో జమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వారాంతంలోగా అర్హులైన ప్రతి రోగి ఖాతా వివరాలు, ఫేస్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జూలై నుంచి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో టీబీ ముక్త్ భారత్ అభియాన్ అవగాహన, స్క్రీనింగ్ క్యాంపులను విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. సమావేశంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి దేవి నాగేశ్వరి, కోఆర్డినేటర్లు లక్ష్మణ్, నరేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అన్ని ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేసుల నమోదు
రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో క్యాన్సర్ కేసులను నమోదు చేయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ సూచించారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, క్లినికల్ ఎస్లాబ్లిష్‌మెంట్ యాక్ట్ విభాగం అధికారులతో జూమ్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేసుల నమోదుతో క్యాన్సర్ల రకాలు, వ్యాధిగ్రస్తుల వివరాలు తెలుస్తుందని, దీంతో చికిత్స అందించడం సులభం అవుతుందని రవీంద్రనాయక్ తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం తనిఖీ
జక్రాన్‌పల్లి : మండలంలోని పడకల్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని డీఎంహెచ్‌వో రాజశ్రీ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బంది హాజరు పట్టిక, మందుల నిల్వ రిజిస్టర్, ఓపి రిజిస్టర్లను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


