నదిలో పడి పశువుల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

నదిలో పడి పశువుల కాపరి మృతి

Jun 5 2026 1:06 AM | Updated on Jun 5 2026 1:06 AM

చెరువులో పడి వృద్ధుడు.. చేపలవేటకు వెళ్లి యువకుడు..

నవీపేట: మండలంలోని యంచ గోదావరి నదిలో పడి ప్రమాదవశాత్తు పశువుల కాపరి మృతి చెందినట్లు ఎస్సై శ్రీకాంత్‌ గురువారం తెలిపారు. వివరాలు ఇలా.. నిర్మల్‌ జిల్లా బాసరకు చెందిన మ్యాతరి నారాయణ(44)కు వివాహం కాలేదు. ఈనెల 2న ఎప్పటిలాగే పశువులను మేపుతూ గోదావరి నదిలో నీటిని తాగించేందుకు తీసుకువెళ్లాడు. నదిలోకి దిగిన నారాయణ ప్రమాదవశాత్తు అందులో పడి ఊపిరాడక మృతి చెందాడు. సాయంత్రం ఎప్పటిలాగే పశువులు ఇంటికి వెళ్లగా, నారాయణ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం నదిలో ఆయన మృతదేహం లభ్యం కావడంతో మృతుడి సోదరి పోశవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మోపాల్‌: మండలంలోని న్యాల్‌కల్‌ చెరువులో పడి ఓ వృద్ధుడు మృతిచెందినట్లు ఎస్సై జాడె సుస్మిత తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన కర్రెళ్ల చిన్న శంకర్‌ (60)కు గత కొంతకాలంగా మానసిక పరిస్థితి సరిగా లేదు. ఈనెల 3న తన గొర్రెలను చూసి వస్తానని ఇంటి నుంచి వెళ్లి, మళ్లీ తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం చెరువు కట్టపై అతడి దుస్తువులు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించగా మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లాకేంద్రాస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

కామారెడ్డి క్రైం: చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటన కామారెడ్డి పెద్ద చెరువులో గురువారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. మున్సిపల్‌ పరిధిలోని సరంపల్లి గ్రామానికి చెందిన బొడ్డారి స్వామి (25) అనే యువకుడు బుధవారం చేపలు పట్టడానికి కామారెడ్డి పెద్ద చెరువుకు వెళ్లాడు. మళ్లీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో గురువారం ఉదయం కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి చూడగా నీటిలో అతడి మృతదేహం కనిపించింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. చేపల కోసం నీటిలోకి దిగగా, ఫిట్స్‌ రావడంతో నీటమునిగి మృతిచెందినట్లు లుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement