ఉద్యమంలో ఉత్సాహంగా డాక్టర్‌ సాబ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యమంలో ఉత్సాహంగా డాక్టర్‌ సాబ్‌

Jun 3 2026 1:15 AM | Updated on Jun 3 2026 1:15 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సకల జనులు చేసిన ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్న డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రస్తుతం నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రూరల్‌ మండలంలోని జలాల్‌పూర్‌కు చెందిన భూపతిరెడ్డి ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. భూపతిరెడ్డి వైద్య వృత్తిని కొనసాగిస్తూనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ఉమ్మడి జిల్లాలో కీలకంగా పనిచేశారు. ప్రజా దవాఖానా పేరిట 20 ఏళ్లు ప్రాక్టీస్‌ చేసిన భూపతిరెడ్డి చాలామందికి ఉచితంగా వైద్యసేవలు అందించి ప్రజలు అభిమానం సంపాదించారు. ఈ క్రమంలో తన ఆస్పత్రి తరఫున పలు పోలియో క్యాంపులు నిర్వహించారు. మరోవైపు 2004 నుంచి 2009 వరకు ‘క్లియర్‌ సొసైటీ’ (చైల్డ్‌ లేబర్‌ ఎలిమినేషన్‌ అండ్‌ రీహాబిటేషన్‌) అనే సంస్థను ఉమ్మడి జిల్లాలో నిర్వహించి దీని ద్వారా 1,500 మందికి పైగా చిన్నారులను పని మాన్పించి బడికి పంపేలా చేశారు. ఈ క్లియర్‌ సొసైటీలో పలువురు విద్యావంతులను భాగస్వాములను చేశారు.

1988లో గాంధీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశారు. 1993లో ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో ఎంఎస్‌(ఆర్థో) పూర్తి చేశారు. తరువాత సంవత్సరం పాటు కోయంబత్తూర్‌ మెడికల్‌ కళాశాలలో శిక్షణ తీసుకున్నారు. నిజామాబాద్‌లో ప్రాక్టీసులో భాగంగా పలువురికి ఉచిత సేవలు అందించారు. 2001లో బీఆర్‌ఎస్‌ పార్టీలో వ్యవస్థాపక సభ్యుడిగా చేరి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2009 నుంచి నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జిగా వ్యవహరించారు. విద్యావంతులు, న్యాయవాదులు, డాక్టర్లు, మేధావులతో కలిసి జేఏసీలో అత్యంత క్రియాశీలకంగా పనిచేశారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2016లో బీఆర్‌ఎస్‌ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత క్రమంలో బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరి 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో

కీలకంగా వ్యవహరించిన భూపతిరెడ్డి

ప్రజా దవాఖానా పేరిట ఉచిత సేవలు

మొదట ఎమ్మెల్సీగా..

ప్రస్తుతం ఎమ్మెల్యేగా చట్ట సభల్లోకి..

Advertisement
 
Advertisement
Advertisement