నిజామాబాద్ అర్బన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఘనంగా సన్మానించారు. గృహ నిర్మాణం, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖల శకటాలు ప్రదర్శనలో పాల్గొన్నాయి. వ్యవసాయ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో స్టాల్స్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ కళాక్షేత్రం, బాల భవన్ చిన్నారులు బతుకమ్మ గేయం, పచ్చదనం ప్రాముఖ్యతపై నృత్యప్రదర్శన ఇచ్చారు. అంతకుముందు వినాయకనగర్‌లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్ తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. వేడుకల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి, డీఎఫ్‌వో సిద్ధార్థ్, అదనపు డీసీపీ శుభం నగ్రాలే, డీఆర్వో గీత తదితరులు పాల్గొన్నారు.


