ఇందూరు స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

ఇందూరు స్ఫూర్తి

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

తెలంగాణ ఉద్యమానికి
నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో ఇందూరు జిల్లా ఉద్యమానికి తీసుకొచ్చిన ఊపు చరిత్రను లిఖించింది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ 2001 జూన్‌ 5న వేల్పూర్‌ మండలంలోని మోతె గ్రామాన్ని సందర్శించి, ఈ గ్రామస్తుల పోరాట స్ఫూర్తి తనకు, బీఆర్‌ఎస్‌కు ఎంతో బలాన్ని ఇచ్చిందని ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. తెలంగాణ ఆవిర్భావం తరువాత 2014 మార్చిలో గ్రామానికి వచ్చిన కేసీఆర్‌ ముడుపు విప్పారు.

● 2016 అక్టోబర్‌ 9న దసరా రోజున పరిపాలన వికేంద్రీకరణ చేశారు. నిజామాబాద్‌ నుంచి ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. జిల్లాలో 14 కొత్త మండలాలు ఏర్పాటు కాగా, మొత్తం మండలాల సంఖ్య 33కు చేరుకుంది.

తండాలను గ్రామపంచాయతీలుగా చేశారు. జిల్లాలో పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది. అన్ని పంచాయతీల పరిధిలో పల్లె ప్రకృతి వనాలు, శ్మశాన వాటికలు, క్రీడా ప్రాంగణాలు నిర్మాణమయ్యాయి. వ్యవసాయంలో అగ్రభాగంలో ఉన్న ఇందూరు జిల్లాకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు మాత్రం ఇప్పటివరకు రాలేదు. లక్కంపల్లిలో ప్రత్యేక ఆర్థిక మండలి ఉన్నప్పటికీ యూనిట్ల స్థాపనలో అడుగులు ముందుకు పడలేదు. వేల్పూర్‌ క్రాస్‌రోడ్డు వద్ద స్పైసెస్‌ పార్క్‌ కోసం 70 ఎకరాలు భూసేకరణ చేసినప్పటికీ అతీగతీ లేదు. అయితే ధాన్యం సేకరణలో జిల్లా వరుసగా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది.

● జిల్లాలో 2014లో పంటల సాగు విస్తీర్ణం 4,14,197 ఎకరాలు ఉండగా, 2026 నాటికి 5,30,000 ఎకరాలకు చేరింది. వరి గణనీయంగా 2లక్షల ఎకరాల మేర పెరిగింది. మరోవైపు ఒకప్పుడు 50 వేల ఎకరాల్లో సాగయ్యే పసుపు పంట ప్రస్తుత ఏడాదికి 20 వేల ఎకరాలకు తగ్గింది. కేంద్ర ప్రభుత్వం జిల్లాలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం..

ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకానికి అప్పటి సీఎం కేసీఆర్‌ 2017 ఆగస్టు 10న శంకుస్థాపన చేశారు. రూ.1,069 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాలేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. ఈ పథకంతో ఎస్సారెస్పీకి ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదు. విద్యుత్‌ బిల్లులు అధికమయ్యాయని విమర్శలు వచ్చాయి. వరద కాలువ ద్వారా నీటి సరఫరా రివర్స్‌ పంపింగ్‌తో కాలువకు ఇరువైపులా భూముల్లో భూగర్భ జలాలు మాత్రం పెరిగాయి.

● కాళేశ్వరం 21వ ప్యాకేజీ కింద ఆయకట్టు స్థిరీకరణ కోసం మోపాల్‌ మండలం మంచిప్ప వద్ద 3.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో జలాశయం నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం 1.5 టీఎంసీల సామర్థ్యంతో మాత్రమే జలాశయాన్ని పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ పనులు నిలిచిపోయాయి.

● జిల్లాలోని 19 మైనారిటీ గురుకులాలు, 11 ఎస్సీ, 13 బీసీ, 5 తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌, 175 ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కేంద్రంలో ఐటీ టవర్‌ నిర్మాణం పూర్తి చేశారు.

● బోధన్‌లోని నిజాం షుగ ర్స్‌ ఫ్యాక్టరీని 2024 సెప్టెంబర్‌ 17లోగా తెరిపిస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించినప్పటికీ అది హామీగానే మిగిలిపోయింది.

● తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రారంభమైన నిజామాబాద్‌ బైపాస్‌ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగానే ఉంది. నగరంలో సుమారు రూ.వెయ్యి కోట్లతో పనులు చేశారు. రూ.240 కోట్ల విలువైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు 2005 నుంచి నడుస్తూనే ఉన్నాయి. జక్రాన్‌పల్లి మండలంలో విమానాశ్రయ ఏర్పాటు కలగానే మిగిలిపోయింది.

● ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ వర్సిటీకి ఇంజినీరింగ్‌ కళాశాల, జిల్లాలో వ్యవసాయ కళాశాల మంజూరు చేసింది.

● 30 ఏళ్ల డిమాండ్‌ అయిన ఆర్మూర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు అయింది. నందిపేట్‌ మండలం నుంచి నిర్మల్‌ జిల్లాను కలుపుతూ పంచగుడి వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మించారు.

● బోధన్‌లో అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి మూడు వైపులా ప్రధాన రోడ్డు మార్గంలో సెంట్రల్‌ లైటింగ్‌ పూర్తి చేశారు. బోధన్‌లో 2021లో రూ.2.35 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అధునాతన నూతన భవనం, 2017లో రూ.3కోట్లతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధునాతన భవనం నిర్మాణం చేశారు.

● ఎడపల్లి మండలం జానకంపేట నుంచి నవీపేట మండలంలోని యంచ వరకు 14.5 కిలోమీటర్ల పొడవున ఉన్న బాసర పుణ్యక్షేత్ర వెళ్లే రోడ్డును రూ.52 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరణ చేశారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ నాన్‌ కమాండ్‌ ఏరియా పరిధిలోని మెట్ట భూములకు సాగునీరు అందించేందుకు మోస్రా మండలంలోని చింతకుంట, వర్ని మండలంలోని జాకోరా ఎత్తిపోతల పథకాలు మంజూరు అయ్యాయి. వీటి పనులు పూర్తి కాలేదు. ఇవి పూర్తి అయితే 4,500 ఎకరాలకు సాగునీటి సౌకర్యం కలుగుతుంది.

వర్ని మండలంలో రూ.102 కోట్లతో ప్రారంభమైన సిద్దాపూర్‌ రిజర్వాయర్‌ పనులు బిల్లులు రాకపోవడంతో ముందుకు సాగడం లేదు. ఈ రిజర్వాయర్‌ పనులు పూర్తయితే 10 వేల ఎకరాలకు సాగు నీటి సౌకర్యం కలుగుతుంది.

బోధన్‌ మండలంలోని బెల్లాల్‌ శివారులో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణాలు సాగుతున్నాయి.

బోధన్‌ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రి 2018లో జిల్లా ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ అయింది. స్థలం సమస్య వల్ల కొత్త భవన నిర్మాణం ప్రతిపాదనలకే పరిమితమైంది.

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన ఇందూరు జిల్లా తనకే ప్రత్యేకమైన పేజీలను లిఖించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును డిమాండ్‌ చేస్తూ మోతె గ్రామస్తులు తీర్మానం చేసి ఉద్యమంలో ముందు వరుసలో నిలిచారు. దీంతో ఉద్యమ నేత కేసీఆర్‌ ఇక్కడి మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లారు. చివరికి ప్రజాపోరాటం ఫలించి 2014 జూన్‌ 2న తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటు కాగా మంగళవారం నాటికి పన్నెండేళ్లు పూర్తవుతున్నాయి. ఈ ప్రస్థానంలో జిల్లాలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్తగా కామారెడ్డి జిల్లా ఏర్పాటైంది. 2023లో పునరుజ్జీవన పథకాన్ని ప్రారంభించి 2.5 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్సారెస్పీకి తరలించారు. జిల్లాలో మండలాల సంఖ్య 33కు, గ్రామ పంచాయతీల సంఖ్య 545కు చేరుకుంది.

సీఎం హోదాలో మోతెకు కేసీఆర్‌

కథనం–1

మోతె మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్‌

పన్నెండేళ్ల ప్రస్థానంలో అనేక మార్పులు

జిల్లాలో 33కు చేరిన మండలాలు, 545కు చేరిన గ్రామ పంచాయతీలు

జిల్లాకు వ్యవసాయ, తెయూకు

ఇంజినీరింగ్‌ కళాశాల మంజూరు

జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం

సీఎం హామీకే పరిమితమైన

నిజాం షుగర్స్‌ పున:ప్రారంభం

కలగానే జక్రాన్‌పల్లి విమానాశ్రయం

మోర్తాడ్‌(బాల్కొండ): తెలంగాణ ఉద్యమ సమయంలో మోతె మోగించిన దరువు ప్రతి ఊరును కదిలించింది. మోతె బాటలో నడిచిన పల్లెల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోయింది. మోతె చూపిన ఉద్యమ స్ఫూర్తికి ముగ్ధుడైన ఉద్యమ నేత కేసీఆర్‌ ఇక్కడి మట్టిని మట్టిని ముడుపు కట్టి తీసుకెళ్లి, రాష్ట్ర సాధన అనంతరం ముడుపు విప్పారు. అనంతరం సీఎం హోదాలో మోతెకు వచ్చిన కేసీఆర్‌ గ్రామానికి కొత్త గ్రామ పంచాయతీ భవనం, నూతన పాఠశాల భవనం, సీసీ రోడ్లు, రైతులకు సిమెంట్‌ కల్లాలు, వంద శాతం డ్రిప్‌ ఇరిగేషన్‌, ఇలా ఎన్నో రకాలైన పథకాలను అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement