డిప్యుటేషన్ల రద్దు కొందరికే.. | - | Sakshi
Sakshi News home page

డిప్యుటేషన్ల రద్దు కొందరికే..

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ పూర్తయినప్పటికీ కొన్ని గంటలు కూడా గడవకముందే కొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ల కోసం ప్రయత్నాలు చేస్తుండడంతో గత నెల 27న ‘సాక్షి’లో ‘బదిలీల కౌన్సెలింగ్‌తో మాకేంటి?’ శీర్షికతో కథనం ప్రచురితం అయింది. దీంతో ఉద్యోగుల డిప్యుటేషన్ల ప్రక్రియ కు బ్రేక్‌ పడింది. ఈ క్రమంలో ఇప్పటికే డిప్యుటేషన్ల మీద ఉన్నవాళ్లు ఆయా స్థానాల్లోనే కొనసాగేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ‘సాక్షి’ కథనం నేపథ్యంలో కొందరు ఉద్యోగుల డిప్యుటేషన్లను రద్దు చేస్తూ జెడ్పీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సగం మంది డిప్యుటేషన్లు మాత్రమే రద్దు అయ్యాయని, మిగిలిన సగం మంది డిప్యుటేషన్లు సైతం రద్దు చేయాల్సి ఉందని ఉద్యోగులు చెబుతున్నారు. ఇంకా రద్దు కాని డిప్యుటేషన్లపై పలువురు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. బోధన్‌ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి జెడ్పీ లో, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉద్యోగి ఆర్మూర్‌ నియోజకవర్గంలోని ఒక మండలంలో, ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఒక మండల ఉద్యోగి మరో మండలంలో, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఒక మండలం ఉద్యోగి బోధన్‌ నియోజకవర్గంలోని మరొక మండలంలో, బాన్సువాడ నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన ఉ ద్యోగి బోధన్‌ నియోజకవర్గంలోని ఒక మండలంలో ఇంకా డిప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా బదిలీలు అయినప్పటికీ యథాస్థానాల్లో కొనసాగేందుకు గాను కొందరు జిల్లా, మండల ప్రజాపరిషత్‌ ఉద్యోగులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లా ప్రజాపరిషత్‌లో ఏళ్లతరబడి కొనసాగుతున్న ఒక సెక్షన్‌ అధికారి ఈ స్థానం నుంచి కదిలేందుకు ఇష్టపడడం లేదని పలువురు ఉద్యోగులు చెబుతున్నారు. సదరు ఉద్యోగి కనుసన్నుల్లోనే మిగిలిన ఎస్టాబ్లిష్‌మెంట్‌ సెక్షన్లు నడుస్తున్నాయని, ఆ సెక్షన్‌ అధికారిని అడగకుండా మిగిలిన సెక్షన్ల ఉద్యోగులు పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. ఆ అధికారి సెలవులో ఉన్న సమయంలో ఎవరైనా ఉద్యోగి పని నిమిత్తం జెడ్పీ కార్యాలయానికి వస్తే తర్వాత రమ్మని చెప్పే పరిస్థితి. ఈ క్రమంలో బదిలీ అయినప్పటికీ సదరు కొందరు అధికారులను మచ్చిక చేసుకుని జిల్లా ప్ర జాపరిషత్‌ ఎన్నికల పేరిట మళ్లీ యథాస్థానంలోనే డిప్యుటేషన్‌ మీద కొనసాగేందుకు అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉద్యోగ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సెక్షన్‌ అధికారి ఆర్మూర్‌ నియోజకవ ర్గంలోని ఒక మండలానికి బదిలీ కాగా అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి జెడ్పీకి బదిలీ అయ్యాడు. ఈ ఇద్ద రూ తిరిగి యథాస్థానాల్లోనే ఉండేలా ప్లాన్లు చేసుకుంటున్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మరో జూనియర్‌ అసిస్టెంట్‌కు నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని ఒక మండలానికి బదిలీ అయింది. ఈ ఉద్యోగి మళ్లీ జెడ్పీలోకి వచ్చేందుకు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడని పలువురు చెబుతున్నారు. ఇక్కడి నుంచి ఫారిన్‌ విభాగానికి వెళతానని తోటి ఉద్యోగుల ముందు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే వీళ్లకంటే గత జెడ్పీ ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. జెడ్పీ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్‌ స్పందించి అక్రమ వ్యవహారాలకు చెక్‌ పెట్టాలని కోరుతున్నారు. గతంలో ఇచ్చిన డిప్యుటేషన్లను సైతం రద్దు చేసి అందరికీ సమన్యాయం చేయాలని కోరుతున్నారు.

మరోవైపు నిజామాబాద్‌ రూరల్‌ మండలం డిప్యుటేషన్‌ కోసం ఇద్దరు ముగ్గురు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన్‌ నియోజకవర్గంలోని ఒక మండలానికి సూపరింటెండెంట్‌ లేకపోవడంతో పనిభారం కింది ఉద్యోగులపై పడుతుందని చెబుతున్నారు.

జెడ్పీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీడీవోకు కిందిస్థాయి సిబ్బంది తక్కువగా ఉంటే పనిభారం పడుతుందని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్ల పేరిట డిప్యుటేషన్ల కథలు నడిపిస్తుండడం పట్ల ఉద్యోగుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. ఈ విషయాలపై జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా కొత్తగా ఎవరికీ డిప్యుటేషన్లు ఇచ్చేది లేదని తెలిపారు.

సగం మందికి మాత్రమే మినహాయింపు ఇవ్వడంపై జెడ్పీ ఉద్యోగుల్లో చర్చ

అందరికీ ఒకే న్యాయం ఉండాలంటున్న ఉద్యోగులు

‘సాక్షి’ కథనంతో జిల్లా ప్రజాపరిషత్‌లో కదలిక

ఎవరికీ డిప్యుటేషన్లు ఇవ్వం

: జెడ్పీ సీఈవో సాయాగౌడ్‌

Advertisement
 
Advertisement
Advertisement