● డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్
డొంకేశ్వర్(ఆర్మూర్): పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం ప్రభుత్వ శాఖలదే కాదని, ప్రజలందరిదని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం సారంగపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్‌లో స్థానిక యువకులు, ఎన్‌జీవోలకు, ప్రజలకు అడవుల సంరక్షణపై అవగాహన కల్పించారు. అడవులు, నదులు, వన్యప్రాణులు, చెట్లు కేవలం సహజ వనరులు మాత్రమే కాదని, అవి మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందిన అమూల్యమైన ఆస్తులని పేర్కొన్నారు. వీటిని మరందరం కాపాడుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. వాతావరణ మార్పుల తీవ్రతకు చాలా కారాణాలున్నాయని అందులో అడవులు క్షీణించడం, ప్లాస్టిక్ వినియోగం అంశాలు ప్రధానమన్నారు. జిల్లాలో అటవీకరణ, పర్యాటక అభివృద్ధిపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలని పిలుపునిచ్చారు. ఎఫ్‌ఆర్వో సంజయ్‌గౌడ్, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.


