సాక్షి నెట్‌వర్క్: పేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసి వారి కళ్లల్లో ప్రజా ప్రభుత్వం ఆనందం నింపిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లోని పలు మండలాలు, గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్లను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ప్రారంభించారు. నిజామాబాద్ రూరల్ మండలం కులాస్‌పూర్‌లో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించి, నూతన వస్త్రాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఒక్కరోజే వెయ్యి ఇళ్ల గృహప్రవేశం చేయడం ఆనందంగా ఉందన్నారు. నియోజకవర్గంలో 2655 ఇండ్లు మంజూరు కాగా, 98 శాతం గ్రౌండింగ్ పూర్తి చేసుకొని జిల్లాలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. రెండో విడతలో అర్హులకు మరిన్ని ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 3,304 ఇళ్ల గృహ ప్రవేశాలు చేశామని వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్మన్ బాడ్సి శేఖర్ గౌడ్, నిజామాబాద్ ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, సర్పంచ్ గుడి జనార్ధన్‌రెడ్డి, డీఆర్వో గీత, ఆర్డీవో రాజేంద్రకుమార్, మండల ప్రత్యేకాధికారి తిరుమల ప్రసాద్, తహసీల్దార్ రేఖ, ఎంపీడీవో రాములు నాయక్, హౌజింగ్ అధికారులు రాజ్యలక్ష్మీ, నివర్తి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జలంధర్‌రెడ్డి, ఎల్లోల్ల సాయిరెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, ఉమ్మాజి నరేష్, హన్మండ్లు, హమీద్, దిలావర్ హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
పలు గ్రామాల్లో ‘ఇందిరమ్మ’
గృహప్రవేశాలు


