నిజామాబాద్ అర్బన్ : ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మినగర్ కాలనీలో మే 24న జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ సాయిచైతన్య వివరాలు వెల్లడించారు. మహాలక్ష్మినగర్ కాలనీకి చెందిన శరత్ కుటుంబసభ్యులతో కలిసి వేములవాడకు వెళ్లారు. దుండగులు పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి రూ.19 లక్షల నగదు, 10 గ్రాముల చైన్, వెండిపెట్‌లు, 580 గ్రాముల బంగారం ముద్దలను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం బ్రాహ్మణపల్లి రోడ్డు వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో పట్టుకొని విచారించగా చోరీకి పాల్పడింది తామేనని ఒప్పుకున్నారు. నిందితులు విజయ్ అగర్వాల్, సల్మాన్‌ఖాన్, మంజల్ సాయికుమార్‌ను అరెస్టు చేయగా, శ్రీహరి పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ.31 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కాగా, విజయ్ అగర్వాల్ సొంత బాబాయి ఇంట్లోనే చోరీ చేసేందుకు మరో ముగ్గురితో కలిసి పథకం వేసినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
● రూ.31 లక్షలు స్వాధీనం
● బాబాయ్ ఇంట్లోనే దొంగతనం చేసిన ఘనుడు


